పీఆర్సీ కోసం బడ్జెట్లో రూ. 6,500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15)లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,500 కోట్లు కేటాయించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ముహూర్తం నిర్ణయించారు. ఉద్యోగ సంఘాలతో శనివారం మధ్యంతర భృతిపై చర్చించడానికి సీఎం సమయం కేటాయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగులకు 15 నుంచి 17 శాతం వరకు ఐఆర్ మంజూరుకు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత వేతనాలపై 15 శాతం మేర ఐఆర్ ఇస్తే రూ. 2,500 కోట్లు.. అదే 17 శాతం ఐఆర్ మంజూరు చేస్తే రూ. 2,800 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చల సమయంలో 20 శాతం నుంచి 22 శాతం లేదా 25 శాతం వరకు ఐఆర్ మంజూరుకు అంగీకారానికి రావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
20 శాతం మేర ఐఆర్ మంజూరు చేస్తే రూ. 3,200 కోట్లు.. 22 శాతం మేర మంజూరు చేస్తే రూ. 3,600 కోట్లు.. 25 శాతం మేర మంజూరు చేస్తే రూ. 4 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ మంజూరునకు సంబంధించిన అంశాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ చూస్తున్నారు. విభజన తర్వాత ఖజానాలో నిల్వ ఉన్న నిధులను ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో పాటు పీఆర్సీ నివేదిక కూడా జాప్యం అవుతుండటంతో ఉద్యోగుల డిమాండ్ మేరకు ఐఆర్ మంజూరు చేయాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.