తమిళనాడుకు రూ.940 కోట్ల వరద సాయం
న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.924 కోట్లు ప్రకటించింది. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ...ఈ మేరకు వరద సాయం విడుదల చేయాలని సోమవారం అధికారులు ఆదేశించారు. తమిళనాడులో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
వరదల కారణంగా తమిళనాడులో కడలూరు, కాంచీపురం, చెన్నై, తిరువెల్లూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోగా ఇప్పటికీ పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయమై ఉన్నాయి. చెన్నై నగరంలో వీధుల్లో చిన్నపడవల సహాయంతో తిరుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
వరదల బారిన పడిన తమిళనాడుకు అన్నివిధాలా సహకరిస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా సహాయక చర్యలకు కేంద్ర బలగాలను పంపారు. ఇక వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందిన అనంతరం మిగతా సాయాన్ని కేంద్రం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రోవాన్ తుఫానుగా మారి తమిళనాడు రాష్ట్రంపైన, కొన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలపైన వర్షాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే.