వెయ్యి కోట్ల పేపర్ వెయిట్
హైదరాబాద్ : వజ్రాలు ఎక్కడున్నా సేకరించడం నిజాం పాలకులకు అలవాటు. అందుకే ప్రపంచంలో ఇప్పుడున్న ప్రముఖ వజ్రాలతో హైదరాబాద్‌తో విడదీయరానిసంబంధం ఉంటుంది. గోల్కొండ సామ్రాజ్య గనుల నుంచి వెలికితీసిన కోహినూర్ ఎన్నో రాజ్యాలు తిరిగి విక్టోరియా రాణి కిరీటంలో చేరింది. దానితో సమానమైన జాకబ్ డైమండ్‌ది కూడా పెద్ద చరిత్రే. దక్షిణాఫ్రికా గనుల్లో దొరికిన ఓ వజ్రాన్ని 1891లో యూరోపియన్లు హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఆరో నిజాంకు అమ్మకానికి పెట్టారు.
అయితే, బేరం కుదరలేదు. దీంతో వజ్రాల వ్యాపారి మాల్కం జాకబ్ మధ్యవర్తిత్వం నెరపడంతో మహబూబ్ అలీఖాన్ రూ. 46 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. మరింత మంచి ధర కావాలంటూ డైమండ్ వర్తకులు పట్టుబట్టారు. అయితే, ఈ విషయం కోర్టుకెళ్లడంతో రూ. 23 లక్షలకే జాకబ్ డైమండ్‌ను నిజాం సొంతం చేసుకున్నాడు. కానీ ఎందుకనో ఆరో నిజాం ఈ వ జ్రంపై ఎలాంటి ఆసక్తి చూపలేదు.
ఆయన చనిపోయిన కొన్నేళ్లకు కొడుకు ఉస్మాన్ అలీఖాన్ తండ్రి షూలో వజ్రాన్ని కనిపెట్టాడు. అలీఖాన్ దీన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడు. అప్పట్లో ‘గ్రేట్ వైట్ డైమండ్’గా పేరొందిన దీని బరువు 184.5 క్యారట్స్ కాగా(36.90 గ్రాములు). సానబెట్టకముందు 400 క్యారట్స్ (80గ్రాములు) ఉండేది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దీని ప్రస్తుతం ధర వెయ్యికోట్ల పైనే. కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించిన మాల్కం జాకబ్ పేరుతోనే దీనికి ఆ పేరు వచ్చింది.