సత్యదేవుని హుండీ ఆదాయం రూ.12.58 కోట్లు
అన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రూ.12.58 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా మంగళవారం స్వామివారి హుండీలను తెరచి లెక్కించారు. గత 25 రోజులకుగాను రూ.80.05 లక్షల ఆదాయం వచ్చింది. దీనిని కలుపుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం వచ్చిన మొత్తం హుండీ ఆదాయం రూ.12.58 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే హుండీల ఆదాయంలో సుమారు 14 శాతం పెరుగుదల నమోదైందని దేవస్థానం ఈవో కె.నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రూ.18 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశామని చెప్పారు.
మంగళవారం హుండీ లెక్కింపు సందర్భంగా నగదుతోపాటు 66 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించాయి. ఒక అజ్ఞాత భక్తుడు 34.870 గ్రాముల బరువు కలిగిన బంగారు హారాన్ని హుండీలో వేశారు. దీని విలువ రూ.1,01,000 ఉంటుందని అంచనా వేశారు. దీనిని శ్రీరామనవమి సందర్భంగా రత్నగిరిపై జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో సీతమ్మవారికి అలంకరిస్తామని ఈవో తెలిపారు. ప్రతి రోజూ కూడా సీతమ్మవారికి ఈ హారాన్ని అలంకరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.