శ్రీవారి హుండీలో చోరీ
తిరుమల: తిరుమల శ్రీవారి హుండీలోనే ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన టీటీడీ నిఘా, భద్రతా విభాగం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడు అధికారుల కళ్లు గప్పి హుండీలో డబ్బులు వేస్తున్నట్లు నటించి రూ.13 వేల నగదును అపహరించాడు.
ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అవడంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. హుండీ నిండటం వల్లే డబ్బులు తీసుకోవడం సాధ్యమైనట్టు అధికారులు గుర్తించారు. అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు. అయితే పటిష్ట భద్రత ఉన్న శ్రీవారి ఆలయంలో చోరీ యత్నం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.