రూ.18 లక్షల నగదు పట్టివేత
నగదు సీజ్ చేసిన పోలీసులు
బళ్లారి : బళ్లారి తాలూకా ఎత్తినబూదిహాల్ చెక్‌పోస్టు వద్ద మోటార్ బైక్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.18 లక్షలు తీసుకుని వస్తుండటంతో పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కణేకల్లు నుంచి బళ్లారికి ద్విచక్ర వాహనంలో భారీ ఎత్తున నగదు తెస్తున్న రెహమాన్, యాకూబ్ అనే ఇద్దరు వ్యక్తులను ఎత్తినబూదిహాల్ చెక్‌పోస్టు వద్ద గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు.
బళ్లారి రూరల్ ఎస్ఐ చందన్ నేతృత్వంలో చెక్‌పోస్టు వద్ద పహారా కాస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తుండగా తనిఖీ చేశారు. అందులో నగదు బయటపడినట్లు రూరల్ డీఎస్పీ సురేష్ తెలిపారు. బళ్లారి జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకుని రావడం నేరమని, దీంతో రూ.18 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. డబ్బులు సీజ్ చేసి నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.