జయలలిత సంక్రాంతి బహుమతి
చెన్నై: తమిళ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీపికబురు అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టుగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబానికి రూ. 100 నగదు, కిలో బియ్యం, కిలో చక్కెరతో పాటు.. రెండు అడుగుల పొడవైన చెరకు గడలను పొంగల్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. బియ్యం పొందడానికి అర్హత ఉన్న రేషన్ కార్డుదారులు కూడా బహుమతి ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు.
జనవరి 15 న సంక్రాంతి పండుగ రోజున రేషన్ దుకాణాల ద్వారా ఈ కానుక పంపిణీ చేస్తారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 1.91 కోట్ల మంది రేషన్ కార్డుదారులతో పాటు శరణార్థి శిబిరాల్లో ఉంటున్న శ్రీలంక తమిళులకు, పోలీసు సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించారు . దీనికోసం రూ. 318 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు.