సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడి
= సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.32 వేలు స్వాధీనం
= కార్యాలయంలో ముగ్గురు బయటి వ్యక్తులున్నట్లు గుర్తింపు
= పక్కా పథకం ప్రకారం రాత్రి 7.15 గంటల సమయంలో దాడి
చీమకుర్తి రూరల్ : చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో మూకుమ్మడిగా దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐలు టీవీవీ ప్రతాప్‌కుమార్, టి.సంజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కార్యాలయం సిబ్బంది వద్ద అనధికారిక నగదు రూ.32 వేలను ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 14 రిజిస్ట్రేషన్లు జరగగా రూ.1.46 కోట్ల విలువైన ఆస్తుల ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది. పట్టుబడిన నగదును ప్రభుత్వానికి జమ చేస్తామని, సబ్ రిజిస్ట్రార్ టి.హేమలతపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అధికారులు, సిబ్బందిపై కేవలం క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసే అధికారం మాత్రమే తమకున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యాలయం పని వేళల్లో ఇతరులు ఎవరినీ అనుమతించకూడదని, అయితే కార్యాలయంలో ముగ్గురు బయట వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు.
ముందు నుంచే ప్రణాళిక: చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై తరుచూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నందున కొన్ని రోజులుగా నిఘా ఉంచామని డీఎస్పీ తెలిపారు. దానిలో భాగంగా బుధవారం సాయంత్రం కార్యాలయం పని వేళలు పూర్తయ్యే వరకూ బయటే నిఘా వేసి ఉన్నామని తెలిపారు. పనివేళల సమయం పూర్తయినా రాత్రి 7 గంటల వరకు కార్యాలయంలోనే సబ్ రిజిస్ట్రార్ ఉండటం గమనించామని ఆయన పేర్కొన్నారు.
ఇది రెండోసారి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరగటం ఇది రెండోసారి. 2013వ సంవత్సరం ఇదే నెలలో అప్పటి సబ్ రిజిస్ట్రార్‌పై స్థానికులు కొంతమంది చేసిన ఫిర్యాదు మేరకు దాడి చేసి అప్పట్లో వారి నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికంటే రెండు సంవత్సరాల ముందు చీమకుర్తిలో నివాసం ఉంటున్న ఏసీటీఓ ఇంటిపై కూడా ఏసీబీ దాడి చేసిన సంఘటన మరొకటి ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటన వార్త చుట్టుపక్కల రెవెన్యూ, మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని సిబ్బంది చెవిన పడటంతో వారంతా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
లంచం అడిగితే ఫోన్ చేయండి..: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నా.. వారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం ఉన్నా తమకు ఫోన్ చేయాలని ఏసీబీ డీఎస్పీ మూర్తి మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్ని ఫోన్ నంబర్లు మీడియాకు ఇచ్చారు. ఏసీబీ డీఎస్పీ మూర్తి 944044 6189, సీఐ ప్రతాప్‌కుమార్ 944044 6187, సీఐ సంజయ్‌కుమార్ 83339 25624