చిల్.. జిల్.. జిగా..
► గ్రేటర్ పరిధిలో లిక్కర్ కిక్కుకు వీకెండ్ జోష్
► శుక్ర, శనివారాల్లో తెగతాగేస్తున్న మందుబాబులు
► నెలకు రూ.700 కోట్ల మేర అమ్మకాలు
► వీకెండ్లో రూ.100 కోట్లు దాటుతోన్న సేల్స్
► రోజుకు పది లక్షల లీటర్ల బీరు.. ఐదు లక్షల లీటర్ల లిక్కర్ స్వాహా
సాక్షి, హైదరాబాద్: ‘‘మందేస్తూ.. చిందెయ్‌రా.. చిందేస్తూ.. మందెయ్‌రా..’’ఇది ఓ సినిమాలోని పాట.. ఇప్పుడు గ్రేటర్‌లోని మందుబాబులు ఇదే పాట పాడుకుంటున్నారు. అటు లిక్కర్.. ఇటు బీరు అనే తేడా లేకుండా తెగ తాగేస్తున్నారు.. ఊగిపోతున్నారు. దీంతో గ్రేటర్లో లిక్కర్ కిక్కు.. కొత్త పుంతలు తొక్కుతోంది. కాస్మోపాలిటన్ సిటీగా పేరొందిన భాగ్యనగరంలో రోజుకు సుమారు పది లక్షల లీటర్ల బీరు.. ఐదు లక్షల లీటర్ల మద్యాన్ని ‘నిషా’చరులు కుమ్మేస్తున్నారట. నగరవ్యాప్తంగా నిత్యం లక్ష కేసుల(ఒక్కో కేసులో 12 సీసాలు) బీరు.. 25 వేల కేసుల లిక్కర్ అమ్ముడవుతోందట. ఇది ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డు అని ఆబ్కారీ శాఖ చెపుతోంది. ప్రధానంగా వీకెండ్ అయిన శుక్ర, శనివారాల్లోనే మందుబాబులు అత్యధికంగా తాగి ఊగేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మందుబాబుల్లోనూ బీరు తాగేవారే అధికంగా ఉండడం విశేషం. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారు బీరును ఎక్కువగా సేవిస్తుండగా.. 35 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులు విస్కీకి ఓటేస్తున్నారట. ఇక జీవనశైలి సమస్యలతో బాధ పడుతున్నవారు బ్రాందీ, రెడ్‌వైన్ వంటి వాటిని ఇష్టపడుతున్నారట.
వీకెండ్లో ఫుల్ జోష్..
ఐటీ, బీపీవో, కేపీవో, రియల్టీ, సేవా రంగాల్లో పని చేస్తున్నవారిలో ఎక్కువ మంది శుక్ర, శనివారాల్లో లిక్కర్ కిక్కుతో పసందు చేసేందుకు మక్కువ చూపిస్తున్నట్లు అమ్మకాల తీరును చూస్తే అవగతమవుతోంది. గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. వీకెండ్ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మేర లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా.
కిక్కు కోట్లలో..
గ్రేటర్లో జనాభా కోటికి చేరువైంది. సిటీలో సుమారు 500 బార్లు.. మరో 400 మద్యం దుకాణాలు, 60 పబ్‌లు ఉన్నాయి. వీటిల్లో రోజువారీగా లిక్కర్ సేల్స్ మూడు ఫుల్లు.. ఆరు బీర్లు అన్న చందంగా మారింది. నెలకు సుమారు రూ.700 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుండగా.. ఇందులో వీకెండ్ రోజుల్లో రూ.400 కోట్లు.. సాధారణ రోజుల్లో రూ.300 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా, మందుబాబులు ఒక్కొక్కరూ సగటున ఏటా 8.23 లీటర్ల బీరు, 7.48 లీటర్ల లిక్కర్‌ను స్వాహా చేస్తుండడం గమనార్హం.
లిక్కర్ మాల్.. క్యా కమాల్..
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ‘టానిక్’బడా లిక్కర్ మాల్ మందుబాబులను విశేషంగా ఆకర్షిస్తోంది. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లిక్కర్ మాల్ ఆసియాలోనే అతి పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. ఈ మాల్లో 1,100 రకాల దేశ, విదేశీ లిక్కర్ బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. రూ.300 బీరు మొదలు రూ. 5.23 లక్షల ఖరీదైన జాన్ వాకర్ విస్కీ వరకు ఇక్కడ లభిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ఈ మాల్‌ను సందర్శిస్తున్నారు.
క్షణాల్లో బీ(రు)రెడీ..
బీరు ప్రియుల దాహార్తిని తీర్చేం దుకు.. క్షణాల్లో చిల్డ్ బీర్‌ను సర్వ్ చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఫ్రోస్ట్, మిర్చీ, హాట్ కప్ తదతర పేర్లతో ఏడు మినీ బ్రూవరీలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల వీటికి ఆదరణ పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని ‘జూబ్లీ 800’మినీ బ్రూవరీ పబ్‌లో 500 మి.లీ. పరిమాణంలో ఉండే బీరు ధర రూ.300. రుచి, నాణ్యత విషయంలో ఈ బీరు యూత్‌ను విశేషంగా ఆకర్షిస్తోందని నిర్వాహకులు చెపుతున్నారు. ఇందులోనూ స్ట్రౌట్, బీట్, స్ట్రాగేల్, యాపిల్ వంటి ఫ్లేవర్స్ లభ్యమవుతున్నాయి.