సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న
కేయూ క్యాంపస్ : విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలని.. ఇక్కడ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తేనే రాష్ట్రం, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేయూ ఏర్పాౖటెన 40 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ మేరకు పాలనలో భేష్ అనిపించుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.రవీందర్‌రెడ్డి, అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాదె దయాకర్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణా«ధికారులు ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం, ప్రొఫెసర్ జి.రామేశ్వరం, డాక్టర్ రాంచంద్రం, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రమేష్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ గాదె పాణి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గిరీశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేయూ న్యూస్ లెటర్ వివేచనను వీసీ ఆవిష్కరించారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన వీసీ.. కేయూలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఏర్పాటుచేసిన పెన్షన్ సెల్‌ను ప్రారంభించారు. అలాగే,కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ జగన్నాథస్వామి, పలువురు పరిశోధకులు కలిసి ఏర్పాటుచేసిన నిర్భయ ఫౌండేషన్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో ప్రతిభచూపిన పి.నాగరాజుకు రూ.10వేల విలువైన పుస్తకాలను వీసీ సాయన్న చేతుల మీదుగా అందజేశారు.