ఉన్నతాధికారులకు కొత్త జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె చేసి 43 శాతం ఫిట్మెంట్ సాధించుకుంటే, ఆర్టీసీ అధికారుల అసోసియేషన్ కూడా అదే స్థాయిలో ఫిట్మెంట్ కలుపుకుని యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. ఉన్నతాధికారులకు పెరగనున్న జీతాలు చూస్తే.. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు (ఈడీలు) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే అధిక జీతం లభించనుంది. రీజనల్ మేనేజర్లకు ఐఏఎస్, ఐపీఎస్ల కంటే జీతాలెక్కువ ఉండటం గమనార్హం. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున జీతాలు పెంచే పరిస్థితి లేదని నివేదికలిచ్చిన ఉన్నతాధికారులు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఫిట్మెంట్ కలుపుకుని కొత్త వేతనాలు ఆమోదించుకోవడం ఎంతవరకు సబబని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కార్మికుల జీతాల పెంపు పట్టించుకోని ఉన్నతాధికారులు గ్రేడ్ పే, అలవెన్సులు కూడా వంద శాతం పెంచుకుంటున్నారని పలు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఆర్టీసీలో ఈడీలు, విభాగాధిపతులు (హెచ్ఓడీలు), డిప్యూటీ సీటీఎం, సీఎంఈ, సీఏవో, వర్క్ మేనేజర్లు, ఏవోలు, ఈఈలు, డిపో మేనేజర్లు, ఆర్టీసీ డాక్టర్లకు మొత్తం 675 మందికి జీతాలు పెరగనున్నాయి. ఈడీల కొత్త మూలవేతనం (బేసిక్ పే) రూ. 1.31 లక్షలు అవుతుందని, రూ. 95 వేలు మినిమమ్ బేసిక్ పేగా పెట్టి, మిగిలిన రూ. 35 వేలు కొత్త గ్రేడ్ పేగా పెట్టుకున్నారు. ఆర్టీసీ ఎండీ కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న ఈడీలు కూడా సంస్థలో ఉన్నారు.