ఏపీలో ఫిట్మెంటు ఊసేలేదు
నేడు మరోసారి సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఐదురోజుల ఆర్టీసీ సమ్మెను కొలిక్కి తెచ్చేందుకు కార్మిక సంఘాలతో రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆదివారం సచివాలయంలో ఉపసంఘంలోని మంత్రులు యనమల రామకృష్ణుడు, శిద్దా రాఘవరావు, కె.అచ్చెన్నాయుడు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబు, ఆర్టీసీ ఎండీ ఎన్.సాం బశివరావులతో ఆర్టీసీ ఈయూ నేతలు పద్మాకర్, దామోదర్ సుమారు 2 గంటల పాటు చర్చలు జరి పారు. సమ్మెను తక్షణమే ఉపసంహరించి విధుల్లో చేరాలని, తమకు 3 వారాల గడువు కావాలని మంత్రివర్గం కోరింది.
43శాతం ఫిట్మెంటుపై ఇప్పుడే ప్రకటన చేసి, మరో 2 నెలల తర్వాత అమలు చేసినా వెంటనే సమ్మె విరమిస్తామని ఈయూ నేతలు తేల్చి చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ సమస్యల పరిష్కారం సాధ్యం కాదని మంత్రివర్గం పేర్కొంది. 2రోజుల తర్వాత నిర్ణయాన్ని చెబుతామని ఈయూ నేతలు తెలిపారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మరోసారి సమావేశమవుతామన్నారు.
ఐదో రోజూ అదేస్థాయి సమ్మె!
సాక్షి, గుంటూరు/అనంతపురం: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజు ఆదివారం భారీస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల వద్దా కార్మికులు స్వచ్ఛభారత్, రౌండ్ టేబుల్ వంటి కార్యక్రమాలు చేపట్టి వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. కార్మికుల సమ్మెకు ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలూ బాసటగా నిలిచాయి. అయితే, కార్మికులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. పలు చోట్ల మద్దతిచ్చిన ప్రజా ప్రతినిధులను అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు గుంటూరులో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.