ఐటీఎస్ అమలుపై స్టడీ
సాక్షి, సిటీబ్యూరో: వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థపై ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రాథమికంగా వెయ్యి బస్సులను ఎంపిక చేశారు. వివిధ రూట్లలో తిరుగుతున్న సిటీ శీతల్ (ఏసీ), లో ఫ్లోర్ నాన్ ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు జీపీఆర్ఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.
ఇంటలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఐటీఎస్)గా వ్యవహరిస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు బస్సుల రూట్లు, సమయపాలన, ఇతర అంశాలపై అధ్యయనం చేపట్టినట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ అధ్యయనం ఆధారంగా ఐటీఎస్ పరిధిలోకి వచ్చే బస్సుల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వారం, పది రోజుల్లో అధ్యయనం పూర్తవుతుందని, ఆపై ఎంపిక చేసిన బస్సులన్నింటిలోనూ ఐటీఎస్ పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు.
మొదట లాంగ్ రూట్లలో...
ఐటీఎస్ ప్రాజెక్టు మొదట లాంగ్ రూట్లలో అమల్లోకి రానుంది. 30-40 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే బస్సుల్లో మొదట ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గ్రేటర్లో 1,050 రూట్లలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో దిల్సుఖ్నగర్-పటాన్చెరు, ఉప్పల్-కొండాపూర్, కోఠి-హైటెక్‌సిటీ, ఎల్బీనగర్-మెహదీపట్నం, ఎల్బీనగర్-సికింద్రాబాద్, ఉప్పల్-లింగంపల్లి వంటి 500కు పైగా లాంగ్ రూట్లు ఉన్నాయి.
ప్రధాన మార్గాల్లో రాకపోకలు సాగించే ఈ బస్సుల్లో ఐటీఎస్‌ను అమల్లోకి తీసుకొస్తే ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజన ం కలుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. పైగా ఐటీఎస్ అమలు కూడా తేలిగ్గా ఉంటుంది. ప్రారంభ స్టేజీ నుంచి చివరి స్టేజీ వరకు అరగంట కూడా పట్టని రూట్లలో ఐటీఎస్ ఏర్పాటు చేయడం కంటే లాంగ్ రూట్లలోనే ఆశించిన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. లాంగ్ రూట్లలో వచ్చే ఫలితాలను బట్టి మిగతా అన్ని రూట్లకు దశలవారీగా ఐటీఎస్ విస్తరణకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది.
వేళల్లో మార్పులు...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అమలుపై ఆర్టీసీ సీరియస్‌గానే దృష్టి కేంద్రీకరించింది. ఎంపిక చేసిన వెయ్యి బస్సుల్లో బంచింగ్, ఒకే రూట్లో ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ బస్సులు వెళ్లకుండా చర్యలు తీసుకొంటారు. ఒకే రూట్లో వెళ్లే బస్సుల సమయపాలనలో తగిన మార్పులు చేస్తారు.
ఉదాహరణకు దిల్సుఖ్నగర్ నుంచి పటాన్‌చెరుకు, వనస్థలిపురం నుంచి కేపీహెచ్‌బీకి బయలుదేరిన బస్సులు ఒకేసారి లక్డీకాపూల్ చేరుకోవడం వల్ల ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ రెండింటి మధ్య కనీసం 5-10 నిమిషాల తేడా ఉన్నా మరింత మంది ప్రయాణికులకు అదనపు రవాణా సదుపాయం లభిస్తుంది. ఇలా ఎంపిక చేసిన వెయ్యి బస్సుల సమయపాలన, రూట్ల నిర్వహణను క్రమబద్ధీకరించడం వల్ల కనీసం 2 లక్షల మంది ప్రయాణికులకు అదనపు రవాణా సదుపాయం లభించే అవకాశం ఉంది.