RTC House complex
-
తిరుమలలో అన్యమత ప్రచారం బస్సు టికెట్లపై నిజాలివే!
సాక్షి, అమరావతి: తిరుమలలో అన్యమత ప్రచారం బస్సు టికెట్లకు సంబంధించి టిమ్ రోల్స్ పంపిణీ వెనుక టీడీపీ సానుభూతిపరులైన అధికారుల పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఇద్దరు ఆర్టీసీ హౌజ్‌లో కీలక అధికారులు కాగా మరొకరు నెల్లూరు స్టోర్స్ అధికారి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి అందిన సూచనల మేరకే తిరుమలకు ఈ రోల్స్ పంపినట్లు స్టోర్స్ అధికారులు పేర్కొనడం గమనార్హం. మైనార్టీ సంక్షేమ పథకాలతో ఉన్న టిమ్ రోల్స్‌ను అన్నీ తెలిసే తిరుమలకు పంపించారని దీన్ని బట్టి రూఢీ అవుతోంది. ఒక్కో టిమ్ రోల్ ఖరీదు రూ.6 కాగా 30 వేల టిమ్ రోల్స్ నెల్లూరు స్టోర్స్‌లో ఉన్నాయి. వీటి ఖరీదు రూ.1.80 లక్షలు. గత ప్రభుత్వం ముద్రించిన ఈ టిమ్ రోల్స్‌ను పక్కన పడేయకుండా తిరుమలకు పంపించేలా టీడీపీ రచించిన కుట్రలో అధికారులు పావులుగా మారినట్లు పేర్కొంటున్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు... నెల్లూరు స్టోర్స్‌లో టిమ్ రోల్స్ కేటాయించే ఓ అధికారికి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆయన చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి అండదండలున్నాయని, టీడీపీ పెద్దల మెప్పు కోసమే బస్సు టికెట్ల వివాదానికి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు పథకాలతో కూడిన టిమ్ రోల్స్‌ను జూన్ 18 తర్వాత పంపిణీ చేయడాన్ని బట్టి పథకం ప్రకారమే చేశారని తెలుస్తోంది. ‘నామినేటెడ్’ చేతిలో పావులు... గత ప్రభుత్వం ఆర్టీసీ నామినేటెడ్ పోస్టులో నియమించిన ఓ టీడీపీ నేత సహకారంతో చేసిన దుష్ప్రచారంలో అధికారులు పావులుగా మారారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయినా ఇంకా నామినేటెడ్ పోస్టులోనే కొనసాగుతున్న సదరు నేత బదిలీ వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్నట్లు సమాచారం. ఖాళీగా విజిలెన్స్ డైరెక్టర్ పోస్టు... ఆర్టీసీలో ఫిర్యాదులపై విచారణ జరిపే విజిలెన్స్ విభాగానికి ఐజీ స్ధాయి అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఏళ్ల తరబడి ఈ పోస్టును యాజమాన్యం భర్తీ చేయడం లేదు. పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే ఈడీ మూడేళ్లుగా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్ విభాగం నివేదికల్ని ఆర్టీసీ బోర్డు, ఎండీ పరిశీలిస్తున్నారో లేదో కూడా అంతుబట్టని పరిస్థితి నెలకొంది. దీంతో ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీనాన్ని అడ్డుకునే ఎత్తుగడలు.. ఆర్టీసీలో కొందరు ఉన్నతాధికారులు సంస్థ విలీనాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్టీసీ విలీనంపై కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సీనియర్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి జగన్ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. పలు దఫాలు కారి్మక సంఘాలు, అధికారులతో సమావేశమైన కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. అయితే ఆర్టీసీ విలీనం జరిగితే తమ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని కొందరు ఉన్నతాధికారులు దీన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. -
అద్దె అదిరే... కమిషనరేట్లు బెదిరే!
► అద్దెల భారంతో నగర శివారులకు.. ► ప్రసాదంపాడులో 30 వేల చదరపు ► అడుగుల్లో ఎక్సైజ్ కమిషనరేట్ ► ఆర్టీసీ హౌస్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ ► అద్దెలతో సతమతమవుతున్న రాష్ట్ర కార్యాలయాలు సాక్షి, విజయవాడ : జూన్ 27 కల్లా నవ్యాంధ్రకు రావాలని సీఎం ఆదేశాలు.. మరో వైపు భయపెట్టే అద్దెలతో రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు సమస్యాత్మకంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెకు నగరంలో భవనాలు దొరక్కపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల అన్వేషణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కొన్ని శాఖలు దూరప్రాంతమైనా పర్వాలేదనే రీతిలో నగర శివారు ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులకు రవాణాపరంగా కొంత ఇబ్బందైనా ముందు భవనం దొరికితే చాలు అనే రీతిలో వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనరేట్, డెరైక్టరేట్ కార్యాలయాలు నగర శివారు గ్రామం ప్రసాదంపాడులో ఏర్పాటు కాగా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ఆర్టీసీ హౌస్‌లో ఏర్పాటవుతోంది. విజయవాడలో అద్దె భవనాల అన్వేషణ ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారింది. చదరపు అడుగకు ప్రభుత్వం రూ.16 ధర నిర్ణయించింది. విజయవాడలోని బందరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో భవనాలు తక్కువ అద్దెకు దొరికే పరిస్థితి లేదు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చదరపు అడుగుకు నెల అద్దె సగటున రూ.40 నుంచి రూ.100 వరకు ఉంది. బందరు రోడ్డు, బెంజ్ సర్కిల్లో రూ.100 వరకు ఉండగా మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య భవనాల అద్దె రూ.40 పైమాటగానే ఉంది. ఈ క్రమంలో రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇలా అనేక విభాగాలకు అద్దె భవనాల కోసం 20 రోజులుగా నిరంతర అన్వేషణ సాగుతోంది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఇతర అధికారులు అపార్ట్‌మెంట్‌ను పరిశీలించి యజమానులతో మాట్లాడుకొని అద్దెను ఖరారు చేసి ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం, డెరైక్టరేట్ కార్యాలయం ఇక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఎక్సైజ్ శాఖకు విజయవాడలోని లెనిన్ సెంటర్లో సుమారు 500 గజాల స్థలం ఉంది. దానిలో గతంలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి మరీ పునాదులు వేశారు. ఆ తర్వాత మళ్లీ పనులు ముందుకు సాగలేదు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా దానిలో భవనం నిర్మిస్తామని ప్రకటించినా అది ఆచరణలోకి రాకపోవటంతో శివారు గ్రామంలో అద్దె భవనానికి వెళ్లాల్సివస్తోంది. ఆర్టీసీ హౌస్‌లో రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం పండిట్ నెహ్రు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ఆర్టీసీ హౌస్‌లో ఒక ఫ్లోర్‌ను రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి కేటాయించారు. ఆర్టీసీ కార్పొరేషన్ కావటంతో చదరపు అడుగుకు రూ.16 అద్దె నిర్ణయించింది. ఆ మేరకు అద్దె చెల్లించి రవాణా శాఖ కార్యాలయం ఇక్కడ ప్రారంభం కానుంది. ఆర్టీసీ హౌస్‌లో ఇతర విభాగాలు తమకు కేటాయించాలని కోరుతుండటంతో రవాణా శాఖ దీనిని ఖరారు చేసుకొని గురువారం ఉదయం కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం కార్యాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 27 కల్లా 80 మంది ఉద్యోగులతో విజయవాడ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్ట నున్నారు.