‘సకలజనుల సమ్మె’ను సెలవుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేపట్టిన సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సింగరేణి, ట్రాన్స్కోలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల సమ్మెకాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం ఆర్టీసీకి ఎందుకు వర్తింపజేయలేదని ఆ సంఘం నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నిం చారు. ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని శనివారం ఇక్కడ జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 30 వేల మంది సంతకాలు చేశారని, దీన్ని 25వ తేదీ వరకు పొడిగిస్తున్నామని వెల్లడించారు.
డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెండి: ఎన్ఎంయూ
డీజిల్‌ను జీఎస్టీ (12 శాతం పన్ను) పరిధిలోకి తేవటం వల్ల దాని ధర భారీగా తగ్గించి ప్రజలకు మేలు చేసే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీసీ ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. ముఖ్యంగా డీజిల్ ధర తగ్గి ఆర్టీసీకి సాలీనా రూ.500 కోట్ల మేర భారం తగ్గుతుందని ఆ సంఘం నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు.