జగన్ వస్తేనే.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
తిరుపతి మంగళం: ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసి, కార్మికుల కష్టాలను తీర్చలిగే సత్తా వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని అని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఏర్పాటై ఐదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం తిరుపతి కోటకొమ్మలవీధిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరో పిం చారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి చేస్తున్న సహాయ సహకారాలు, నిధుల మంజూరు, పోస్టుల భర్తీ వంటి సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీఎస్ ఆర్టీసీకి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులను ఏపీకే కేటా యించాలని, డీజల్‌పై ట్యాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా సైనికుల్లా పనిచేసి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, చెలికం కుసుమ, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర, జిల్లా కార్యదర్శి టి.రవిశంకర్, జిల్లా కోశాధికారి మారెప్ప, రాష్ట్ర నాయకులు పీసీ బాబు, టీఎస్ఎస్.ప్రసాద్, సీబీ ఎస్.రెడ్డి, పీసీ.బాబు, రాజేంద్ర, టి.రవికుమార్ పాల్గొన్నారు.