సమైక్యం కోసం అనంతలోకాలకు..
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనపై కలతతో ఆర్టీసీ నెల్లూరు-1 డిపో డ్రైవర్ నూతక్కి రాములు (47) శనివారం ఉదయం నెల్లూరులోని సరస్వతినగర్‌లో తన నివాసంలో మృతి చెందారు. దినపత్రికలో ఉద్యమ వార్తలు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు.కుటుంబ సభ్యులు తేరుకుని వైద్యులను సంప్రదించారు. రాములును వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. రాములు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీఓలు, ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
శిబిరం వద్దకు ఊరేగింపుగా..
రాములు మృతదేహాన్ని సరస్వతినగర్‌లోని ఆయన నివాసం నుంచి బస్‌స్టేషన్ ప్రాంగణంలోని శిబిరం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు పెద్దసంఖ్యలో శిబిరం వద్దకు చేరుకుని రాములుకు నివాళులర్పించారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ సుధాకర్‌రావు మాట్లాడుతూ బట్టా శంకరయ్య, సీహెచ్ సోమశేఖరరావు, సత్యనారాయణ, రాములు ఇలా ఎంత మంది అసువులు బాసిన కేంద్రం కళ్లు తెరవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి త్యాగాన్ని వృథాకానివ్వబోమని ప్రతినబూనారు. మృతదేహాన్ని రాములు సోదరుడి ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో కె.రమణరాజు, వి.పెంచలరెడ్డి, నారాయణరావు, మహబు, డీబీ శామ్యూల్, సీహెచ్ శ్రీనివాసులు, ఏఎస్ఆర్ కుమార్, శేఖర్, శశి, రమేష్‌రెడ్డి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళి
దీక్షా శిబిరంలో రాములు మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఆర్టీసీ ఆర్ఎం చింతా రవికుమార్, డిప్యూటీ సీటీఎం పి.చంద్రశేఖర్, నెల్లూరు -1, 2 డిపో మేనేజర్లు ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్కే షమీమ్ సందర్శించి నివాళులర్పించారు.
సమైక్యభేరి నుంచి ఇంటికెళుతూ..
సంగం: మండలంలోని ఉడ్‌హౌస్‌పేటకు చెందిన ఉక్కాల రవి(42) వ్యవసాయ కూలీ. ఆయనకు మొదటి నుంచి సామాజిక చైతన్యం ఎక్కువ. విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్రుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు.
అందులో భాగంగా శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన సమైక్యభేరి సభకు హాజరయ్యాడు. సమైక్య నినాదాలతో హోరెత్తించాడు. అనంతరం ఇంటికి వెళుతూ తరుణవాయి వద్ద గుండెపోటుతో అపస్మారస్థితికి చేరుకున్నాడు. గ్రామస్తులు ఇంటికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. రవికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం సంగం తహశీల్దార్ శ్రీకాంత్, చిల్లకూరు ఎంపీడీఓ చిరంజీవి, జేఏసీ నాయకులు సురేంద్రరెడ్డి, ప్రభాకర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతదేహంపై సమైక్యాంధ్ర జెండాను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు.