కారుణ్యం కాదు..కాఠిన్యం!
విజయనగరం అర్బన్: సంస్థకు సేవలందించిన ఉద్యోగుల వారసుల పట్ల ‘కారుణ్యం’ చూపాల్సిన ఆర్టీసీ అధికారులు కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. విధి నిర్వహణలో ఉంటూ అకాల మరణం పాలైన ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడకుండా వారసులకు ఉద్యోగాలివ్వాలని చట్టం శాసించినా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అప్పుడప్పుడు అరకొర ఉద్యోగాలను భర్తీ చేస్తామనిప్రకటించి కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. 1998 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ నార్త్ఈస్టు కోస్టు(నెక్) రీజియన్ పరిధిలోని ‘కారుణ్య’ నియామకాలకు అర్హులు 600 మందికిపైగా ఉన్నారు. వీరి కోసం ఎప్పటికప్పడు పోస్టులను మంజూరు చేయాల్సిన అధికారులు తమ తోచినపుడు పరిమిత సంఖ్యలో భర్తీ చేస్తున్నారు.
ధ్రువీకరణపత్రాల పరిశీలనలో జాప్యం.. అభ్యర్థుల పాట్లు
తాజాగా నెక్ రీజియన్ అధికారులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని డిపోల పరిధిలో కేవలం 116 కారుణ్య పోస్టులను ప్రకటించారు. వీటిలో 45 పోస్టుల భర్తీ ప్రక్రియను బుధవారం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో చేపట్టారు. భర్తీ చేస్తున్న పోస్టులు 45 ఉండగా సీనియార్టీ ప్రాతిపదకన 94 మంది అభ్యర్థులను పిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని ప్రారంభించకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు. గంటల తరబడి ఎండలో నిరీక్షించలేక నరకయాతన అనుభవించారు. విజయనగరం జిల్లాలోని 37 కండక్టర్ పోస్టుల కోసం వచ్చిన 44 మంది, శ్రీకాకుళం జిల్లాలోని 8 పోస్టుల కోసం వచ్చిన 54 మంది ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. విజయనగరం జిల్లా పోస్టుల్లో డిపోలకు 33, నాన్ ఆపరేషన్ విభాగానికి 4 పోస్టులు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు కండక్టర్లు, నాలుగు శ్రామిక పోస్టులున్నాయి. వీటిలో సగం పోస్టులను మహిళలకు కేటాయించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ అప్పలనారాయణ, డీప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు (శ్రీకాకుళం), ఆర్ఎం కార్యాలయం పీవో మల్లికార్జునరాజు, సహాయ మేనేజర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.