ఆ రోజు ఆర్బీఐ దగ్గరున్న కొత్త నోట్లెన్నో తెలుసా?
ముంబాయి : పాత నోట్ల రద్దు నిర్ణయం ముందస్తు అన్ని ప్రణాళికలు తీసుకున్నాకే ప్రకటించామని ప్రభుత్వం ఊదరగొడుతుంటే, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లో వాటిలో ఉన్న నిజమెంతో తేలింది. బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన రోజున ఆర్బీఐ వద్ద కేవలం రూ.4.95 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే ఉన్నాయని ఆర్టీఐ సమాధానంలో వెల్లడైంది. ముంబాయికి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గలి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ వివరాలు వెల్లడించింది. నవంబర్ 8వ తేదీన తమ వద్దనున్న పాత నోట్లకు నాలుగవ వంతు కంటే తక్కువగా కొత్త నోట్లున్నాయని ఉన్నాయని పేర్కొంది. అంటే రూ.4.94 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది.
అదేవిధంగా రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్లు రూ.20.51 లక్షల కోట్లున్నట్టు తెలిపింది. కొత్త నోట్లు సరిపడ లేకపోయినప్పటికీ, సమస్యలు తలెత్తుతాయని తెలిసినప్పటికీ 125 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న నగదును నిరూపయోగంగా మార్చుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని గల్గలి విమర్శించారు. ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆర్బీఐ వద్ద ఒక కొత్త రూ.500 నోటు కూడా లేదని, నగదు కొరతతో ఏర్పడుతున్న సమస్యలకు తర్వాత రూ.500 నోట్లను ప్రింట్ చేయడం ప్రారంభించి సిస్టమ్లో తీసుకొచ్చారని ఆర్టిఐ సమాధానంలో తేలిందని గల్గలి వెల్లడించారు. నవంబర్ 8వ తేదీన రూ.15.44 లక్షల కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు చలామణిలో ఉన్నాయని అంచనావేశారు. అయితే ఇన్ని వివరాలు తెలిపిన ఆర్బీఐ నవంబర్ 9 నుంచి 19 దాకా బ్యాంకులకు సరఫరా చేసిన నోట్ల వివరాలను మాత్రం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్8(1)ని పేర్కొంటూ గోప్యంగా ఉంచింది.