మోదీ ప్రచారానికి రూ. 1100 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తీసిన అడ్వర్టైజ్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండున్నర ఏళ్ల కాలంలో ఏకంగా 1100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. అది కూడా కేవలం టీవీ యాడ్స్, ఇంటర్నెట్, ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం మాత్రమే. ఇక పత్రికల యాడ్స్‌కు, హోర్డింగ్‌లకు, బుక్లెట్స్కు, క్యాలెండర్లకు ఖర్చు పెట్టిన మొత్తాలను కూడా పరిగణిలోకి తీసుకుంటే ఇంతకు పదింతలు ఎక్కువే అవుతుంది. రఘువీర్ సింగ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానాంగా కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ వివరాలను అందజేసింది.
2014, జూన్ 1వ తేదీ నుంచి 2016, ఆగస్టు 31వ తేదీ వరకు మోదీతో తీసిన ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ప్రచారానికి 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మొత్తాన్ని రోజువారి ఖర్చు కింద విడగొడితే రోజుకు 1.4 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ‘మంగళయాన్’ ప్రయోగానికి ఖర్చయిన 450 కోట్ల రూపాయలకన్నా మోదీ ప్రచారానికైన ఖర్చు ఎంత ఎక్కువో లెక్కించవచ్చు.
దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును వెలుగులోకి తీసుకొచ్చి పేద ప్రజలకు మంచి చేస్తానని ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మోదీ యాడ్స్ కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం ఎంతమేరకు సమంజసమో ప్రభుత్వ వర్గాలే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తన ప్రభుత్వం ప్రచారం కోసం రోజుకు 16 లక్షల రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారని ఇదే సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు....ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారంటూ ఆయనపై దుమ్మెత్తి పోసిన బీజేపీ వర్గాలు ఇప్పుడు ఏమంటాయో చూడాలి.