ఆర్టీఐతో కేసుల పరిష్కారం సులువైంది
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టంతో పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి వస్తోందని, న్యాయస్థానాల్లో కొన్ని కేసుల పరిష్కారం సులభతరమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ఆర్టీఐ యూజ్ అండ్ అబ్యూజ్’ పుస్తకాన్ని గురువారమిక్కడ జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. పదేళ్ల ఆర్టీఐ చట్టంపై రూపొందించిన మరో పుస్తకాన్ని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ విజయ్‌శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం అమల్లో లేని సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
కొన్ని కేసులకు సంబంధించి న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కూడా ప్రభుత్వ శాఖల నుంచి పూర్తి సమాచారం అందేది కాదన్నారు. మాడభూషి రచించిన ఈ పుస్తకం అన్ని వర్గాలకు ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ విజయ్‌శర్మ మాట్లాడుతూ.. ఈ పుస్తకం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 2014లో ఢిల్లీ వచ్చిన తర్వాత తాను ఇచ్చిన అనేక ఉత్తర్వుల ఆధారంగా పుస్తకాన్ని రాసినట్లు మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. త్వరలోనే తెలుగు అనువాద పుస్తకాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సమాచార మాజీ ప్రధాన కమిషనర్ వజాహత్ హబీబుల్లా, ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్, న్యాయవాదులు, మేధావులు పాల్గొన్నారు.