RTO offices
-
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త!
మీరు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త. ఇక లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాల(ఆర్టీఓ) వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా ఓ ముసాయిదాను తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం జూలై 1 నుంచి కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్ కోరుకునే వ్యక్తి ఏదైనా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలోనే ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలోనే డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ శిక్షణ కేంద్రాల వద్ద సిమ్యులేటర్లు, దరఖాస్తుదారులకు హైక్వాలిటీ ట్రైనింగ్ కోసం ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను కలిగి ఉంటాయి. గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ లో లైట్ మోటార్ వేహికల్ కొరకు డ్రైవింగ్ కోర్సు ప్రారంభం అయిన తేదీ నుంచి గరిష్టంగా నాలుగు వారాల వ్యవధిలో 29 గంటల పాటు రన్ అవుతుందని నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది. అలాగే, శిక్షణ కేంద్రాలలో మీడియం, హెవీ మోటార్ వేహికల్ డ్రైవింగ్ కోర్సుల కాలవ్యవధి 38 గంటలు(ఆరు వారాల వ్యవధిలో). ఇందులో రెండు సిగ్మెంట్లు ఉంటాయి.. ఒకటి థియరీ, రెండవది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో కొన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తారు. రోడ్డుపై ఇతరులతో నైతికంగా, మర్యాదపూర్వకంగా ఎలా నడుచుకోవలో వంటి కొన్ని ప్రాథమికాంశాలను ఈ శిక్షణలో నేర్పిస్తారు. ఈ కోర్సు వల్ల రహదారిపైకి నైపుణ్యం కలిగిన డ్రైవర్లు వస్తారు అని కేంద్రం పేర్కొంది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల కొరకు మంజూరు చేయబడ్డ అక్రిడిటేషన్ ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పునరుద్దరించుకోవచ్చు. చదవండి: ప్రతి నెల రూ.55 పొదుపుతో.. నెల నెల రూ.3000 పెన్షన్ -
కాసులిస్తేనే ధ్రువీకరణ!
కరీంనగర్ హెల్త్: పుట్టినా పైసలే.. చచ్చినా పైసలే అన్నట్లు ఉంది వ్యవహారం. ఏ సర్టిఫికెట్ కావాల న్నా చేతులు తడపాల్సిన దుస్థితి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ఉంది. రికార్డులు భద్రపరిచే గది సిబ్బంది కాసుల కక్కుర్తికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందాలంటే డబ్బులు ఇవ్వందే అందడం లేదు. అవసరమే ఆసరా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మంథని శ్రీరా ములు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుమారుడు శంకర్‌దాసు దుబయ్‌లో ఉంటున్నాడు. మరణించిన తర్వాత గడువులోపు ధ్రువీకరణపత్రం తీసుకోవాలనే అవగాహన లేకపోవడంతో అతను దుబయ్ వెళ్లిపోయాడు. తన తల్లికి ప్రభుత్వం నుంచి వితంతువు పింఛన్ దరఖాస్తు కోసం తన తండ్రి మరణ ధ్రువీకరణపత్రం అవసరం ఏర్పడింది. దీని కోసం దరఖాస్తు చేసుకోగా మున్సిపాలిటీలో రికార్డు కాలేదని ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో మృతుడి భార్య దరఖాస్తు చేసుకోగా రికార్డులు ఇప్పుడు దొరకవని.. పరిశీలించి రాయాలంటే డబ్బులు ఖర్చు అవుతుందని అనధికార అసిస్టెంట్ ద్వారా డిమాండ్ చేశాడు. ఇలా రెండు వారాల తర్వాత ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి జోక్యంతో మరణ ధ్రువీకరణపత్రం జారీ అయ్యింది. అవగాహన లోపం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి నుంచి జనన, మరణ ద్రువీకరణపత్రం పొందాలంటే కాసులు ఇవ్వాల్సిందే. ఈ ధ్రువీకరణపత్రం పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రం సకాలంలో పొందాలనే అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారుల అమాయకత్వం, అవసరాన్ని ఆసరాగా చేసుకొని సర్టిఫికెట్లు జారీ చేసే ప్రభుత్వ ప్రధానాస్పత్రి రికార్డులు భద్రపరిచే గది అధికారి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికెట్ జారీ చేయడానికి రెండు నుంచి రూ.5వేలు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. డిమాండ్ చేసిన డబ్బులు ముట్టచెప్పకపోతే వారాల తరబడి రికార్డులు లేవంటూ తిప్పుకుంటున్నారని బాధితులు పేర్కొంటున్నారు. తప్పుల తడకగా రికార్డులు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు రెండు నెలల్లోపు సంబంధిత మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల నుంచి పొందాల్సి ఉంటుంది. రెండు నెలల గడువు దాటితే ఆర్డీవో నుంచి పొందాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ప్రభుత్వాస్పత్రి వైద్యుడి ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రిలోని రికార్డులు ఉండే గది అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికెట్ జారీ చేయడానికి రికార్టుల గది సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రికార్డులు లేవని, వెతికిన దొరకడం లేదని, రికార్డుల్లో తప్పులు ఉన్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పులు ! ధ్రువీకరణపత్రాల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో రికార్డు గది సిబ్బంది వివరాలు తప్పులతడుకగా నమోదు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, లేదా తల్లిపేరు, లేదా మరణించిన వారి పేర్లు, పుట్టిన, మరణించిన తేదీలు ఇలా ఏదో ఒకటి రికార్డుల్లో తప్పులు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు ఇక్కడి నుంచి రికార్డుల సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. రికార్డులలో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి రికార్డుల గది అసిస్టెంట్‌ను సంప్రదించాల్సి వస్తుంది. వాటిని సరిచేసి సర్టిఫికెట్ జారీ చేయాలంటే మరికొన్ని డబ్బులు ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేస్తే అందినకాడికి దండుకుంటున్నారు. అనధికార సిబ్బందితో పనులు జనన, మరణ ధ్రువీకరణపత్రాలు భద్రపరిచే రికార్డు గదిలో ప్రైవేట్ వ్యక్తుల చెలామణి చేస్తూ.. రికార్డులు రాస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. రికార్డుగదిలో ఒకరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. పని ఒత్తిడి అవుతుందనే సాకుతో అనధికారికంగా మరొకరిని అసిస్టెంట్‌గా ఏర్పాటు చేసుకొని అతని ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. -
కోట్లలో వ్యాపారం... సర్కారుకు సున్నం!
♦ పన్ను చెల్లింపులో ఆటోమొబైల్ డీలర్ల చేతివాటం ♦ కొనుగోలుదారుల నుంచి 14.5% పన్ను వసూళ్లు ♦ చెల్లింపుల్లో మాత్రం తప్పుడు లెక్కలు ♦ 300 డీలర్ల ఎగవేత సొమ్మే రూ. 25 కోట్లు ♦ ఏటా సుమారు రూ. 100 కోట్ల ఎగవేత ♦ 900 మంది డీలర్ల మూడేళ్ల లెక్కల సేకరణలో అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆటోమొబైల్ డీలర్లు సర్కారుకు పన్ను చెల్లింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పేరున్న టూ వీలర్, త్రీ, ఫోర్ వీలర్ కంపెనీల డీలర్లతోపాటు జిల్లాల్లోని ట్రాక్టర్, ట్రక్ డీలర్లు కొనుగోలుదారుల నుంచి వ్యాట్ పేరుతో భారీగా పన్ను వసూళ్లు చేస్తున్నప్పటికీ దానిని ప్రభుత్వానికి చెల్లించే సమయంలో మాత్రం తప్పుడు లెక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల దృష్టిసారించిన వాణిజ్యపన్నులశాఖ కళ్లు చెదిరే వాస్తవాలు తెలుసుకుంది. నెలకు రూ. 1,000 కోట్ల వరకు వ్యాపారం చేసే ఆటోమొబైల్ డీలర్లు ఏటా కనీసం రూ. 100 కోట్ల వరకు వాణిజ్యపన్నులశాఖకు ఎగనామం పెడుతున్నట్లు తేలింది. ఆర్టీవో ఆఫీసుల నుంచి వివరాల సేకరణ.. రాష్ట్రంలో విక్రయించిన ప్రతి వాహనం రవాణాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ మేరకు గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను వాణిజ్యపన్నులశాఖ అధికారులు సేకరించారు. తద్వారా ఏయే డీలర్లు ఎన్ని కోట్ల విలువైన వాహనాలను విక్రయించి ఎంత పన్ను చెల్లించారనే విషయాలను విశ్లేషించారు. వాహనాల బేసిక్ ధర, యాక్సెసరీస్‌తోపాటు వ్యాట్ మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్న డీలర్లు పూర్తిస్థాయిలో పన్ను చెల్లించడం లేదని తేల్చారు. పది వాహనాలు విక్రయిస్తే వాటిలో కొన్నింటి వ్యాట్‌ను చెల్లించడం లేదని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్యపన్నులశాఖ డిప్యూటీ కమిషనర్లు ఆయా జిల్లాల్లో మూడేళ్లలో జరిగిన ఆటోమొబైల్ విక్రయాలు, చెల్లించిన పన్ను వివరాలను కమిషనర్ అనిల్ కుమార్‌కు శనివారం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 900 మంది డీలర్లు ఉండగా వారిలో కేవలం 300 మందికి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తేనే ఒక సంవత్సరంలో రూ. 25 కోట్ల వరకు పన్ను చెల్లించలేదని తేలినట్లు సమాచారం. ఈ లెక్కన ఏటా సుమారు రూ. 100 కోట్ల వరకు ఆటోమొబైల్ వ్యాపారులు పన్ను చెల్లించడం లేదని అంచనా. ఈ నేపథ్యంలో మూడేళ్లలో 900 మంది డీలర్లు ఎంత మేర ఎగ్గొట్టారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, వాణిజ్యపన్నులశాఖ చేపట్టిన చర్యల గురించి తెలిసిన కొందరు డీలర్లు బకాయిలను స్వచ్ఛందంగా చెల్లించేం దుకు ముందుకు వచ్చినట్లు తెలియవచ్చింది. ఎగవేతదారుల నుంచి పన్నుతోపాటు కనీసం 25 శాతం అపరాధ రుసుము వసూలు చేయనున్నట్లు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
తహసీల్దారు కార్యాలయాలకు భవనాలు
సీసీఎల్ఏకు ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న మండల తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మా ణం, సొంత భవనాల్లో ఉన్న కార్యాలయాల్లో ఆధునీకరణ పనులకు సర్కారు అంగీకారం తెలిపింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం ఇప్పటికే మంజూరు చేసిన రూ.10 కోట్లను వెంటనే అవసరమైన ప్రాంతాలకు కేటాయించాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ)ను సర్కారు ఆదేశించింది. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, తహసీల్దార్ల సంఘాలు చేసిన ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీఎల్ఏకు ప్రభుత్వం సూచిం చింది. అదనపు బడ్జెట్ అవసరమైనపక్షంలో తగిన ప్రతిపాదనలను పంపాలని సీసీఎల్ఏకు సర్కారు తాజాగా మెమో జారీచేసింది. సీసీఎల్ఏకు సర్కారు ఆదేశాలు ఇవీ.. - అద్దె వాహనాలు వినియోగించే మండల తహసీల్దార్లు, ఆర్డీవోలకు అదనపు బడ్జెట్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలి. - పనిభారం మేరకు తహసీల్దార్ కార్యాలయాలను విభజించే అంశాన్ని పరిశీలించాలి. విద్యుత్ బిల్లులు చెల్లించని కార్యాలయాలకు వెంటనే సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. నిధుల ప్రతిపాదనలు పంపాలి. - ఆహార భద్రత కార్డుల జారీ సమయంలో తహసీల్దార్లు చేసిన ఖర్చును పౌరసరఫరాల విభాగం ఇవ్వనందున, కార్డుకు రూ.10 చొప్పున తహసీల్దార్లకు వెంటనే చెల్లించాలి. - కోర్టు కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులకు న్యాయ సలహాలను పొందేందుకు ప్రతి జిల్లాకు ఒక న్యాయవాదిని నియమించుకోవాలి. - డీటీలుగా పదోన్నతులు పొందేందుకు అర్హులైన తహసీల్దార్ల జాబితాను పంపాలి. కలెక్టరేట్లో ఉండే అదనపు జేసీల పని పంపిణీ ప్రతిపాదనలను పంపాలి. - ‘ఈ-ధాత్రి’పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. - జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోని సూపరింటెండెంట్ పోస్టులను తహసీల్దారు కేడర్‌కు, ఏవో పోస్టును డిప్యూటీ కలెక్టర్ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది. -
ఆర్టీఓలో అందుబాటులో లేని డ్రైవింగ్ యంత్రాలు
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఓ కార్యాలయాలలో డ్రైవింగ్‌పై శిక్షణనిచ్చే యంత్రాలను అమర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కొన్ని ఆర్టీఓ కార్యాలయాలలో వీటిని అమర్చినప్పటికీ అవి పని చేయడం లేదు. కంప్యూటర్ స్క్రీన్‌పై శిక్షణనిచ్చే ఈ యంత్రాలను ఎన్నింటిని అమర్చాలో కూడా నిర్ణయించలేదు. రోడ్డుపై వాహనాన్ని సురక్షితంగా నడిపేందుకు గాను కంప్యూటర్ ప్రోగ్రామ్ మిషన్‌పై ఆర్టీఓ కార్యాలయాలలో ఈ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయాలలో డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే సమయంలో శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించే పరికరాలు కూడా సక్రమంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఓ ఆర్టీఓ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ డ్రైవింగ్‌పై శిక్షణనిచ్చే యంత్రాలను అమర్చడంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత అంధేరీ, తాడ్‌దేవ్ ఆర్టీఓలలో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ఇదిలా వుండగా అంధేరీలో ఉన్న ఈ యంత్రం గత కొన్ని రోజులుగా పని చేయడం లేదు. ఈ పరికరం ఎంతో ఖరీదైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పరికరాన్ని అమర్చడంలో జాప్యం చేస్తుందని మరో అధికారి చెప్పారు. అయితే ఈ డ్రైవింగ్ శిక్షణ యంత్రాలకు గాను ఒక్కోదానికి రూ.ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు అవుతోందని అన్నారు. ప్రస్తుతం బస్ డ్రైవింగ్ కోసం ఈ శిక్షణ యంత్రాలు వెస్టర్న్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ (డబ్ల్యూఐఏఏ) డ్రైవింగ్ సెంటర్ చర్చ్‌గేట్‌లో అందుబాటులో ఉన్నాయి.