తహసీల్దారు కార్యాలయాలకు భవనాలు
సీసీఎల్‌ఏకు ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న మండల తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మా ణం, సొంత భవనాల్లో ఉన్న కార్యాలయాల్లో ఆధునీకరణ పనులకు సర్కారు అంగీకారం తెలిపింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం ఇప్పటికే మంజూరు చేసిన రూ.10 కోట్లను వెంటనే అవసరమైన ప్రాంతాలకు కేటాయించాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ (సీసీఎల్‌ఏ)ను సర్కారు ఆదేశించింది. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, తహసీల్దార్ల సంఘాలు చేసిన ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీఎల్‌ఏకు ప్రభుత్వం సూచిం చింది. అదనపు బడ్జెట్ అవసరమైనపక్షంలో తగిన ప్రతిపాదనలను పంపాలని సీసీఎల్‌ఏకు సర్కారు తాజాగా మెమో జారీచేసింది.
సీసీఎల్‌ఏకు సర్కారు ఆదేశాలు ఇవీ..
- అద్దె వాహనాలు వినియోగించే మండల తహసీల్దార్లు, ఆర్డీవోలకు అదనపు బడ్జెట్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలి.
- పనిభారం మేరకు తహసీల్దార్ కార్యాలయాలను విభజించే అంశాన్ని పరిశీలించాలి. విద్యుత్ బిల్లులు చెల్లించని కార్యాలయాలకు వెంటనే సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. నిధుల ప్రతిపాదనలు పంపాలి.
- ఆహార భద్రత కార్డుల జారీ సమయంలో తహసీల్దార్లు చేసిన ఖర్చును పౌరసరఫరాల విభాగం ఇవ్వనందున, కార్డుకు రూ.10 చొప్పున తహసీల్దార్లకు వెంటనే చెల్లించాలి.
- కోర్టు కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులకు న్యాయ సలహాలను పొందేందుకు ప్రతి జిల్లాకు ఒక న్యాయవాదిని నియమించుకోవాలి.
- డీటీలుగా పదోన్నతులు పొందేందుకు అర్హులైన తహసీల్దార్ల జాబితాను పంపాలి.
కలెక్టరేట్లో ఉండే అదనపు జేసీల పని పంపిణీ ప్రతిపాదనలను పంపాలి.
- ‘ఈ-ధాత్రి’పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.
- జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోని సూపరింటెండెంట్ పోస్టులను తహసీల్దారు కేడర్‌కు, ఏవో పోస్టును డిప్యూటీ కలెక్టర్ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది.