మహబూబాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు జాబ్స్ పేరిట.. లంచాలు తీసుకున్న వారిని ఏసీబీ కేసు నుంచి తప్పిస్తామంటూ టోకరా వేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి ఓ వ్యక్తి పాల్పడగా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకుంటూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోని సర్వేయర్‌గా పని చేస్తున్న కొందరు ఉద్యోగులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు.
మోసానికి పాల్పడుతున్న తీరు ఇలా..
కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న సర్వేయర్లతో తనకు తాను ఏసీబీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీరు లంచాలు తీసుకున్నారని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ సర్వేయర్‌గా పని చేస్తున్న మల్లయ్యకు ఈ నెల 16న ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
‘నువ్వు లంచం తీసున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ కేసు నుంచి నిన్ను తప్పించేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. అదే రోజు పర్వతగిరి మండలంలో పని చేస్తున్న సర్వేయర్ శ్యామూల్‌కు అదే వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కేసు నమోదు చేస్తామని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు.
అలాగే నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని సర్వేయర్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంతటితో ఆగకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని పలువురు సర్వేయర్లకు ఫోన్లు చేసి ఏసీబీ కేసుల నుంచి మిమ్మలను తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఇందుకోసం గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. సందేహం వచ్చిన సదరు ఉద్యోగులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
నిందితుడితో జరిగిన సంభాషణ, ఫోన్ నంబర్ వివరాలు అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల ముసుగులో సర్వేయర్లను నమ్మించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. సదరు నిందితుడికి డబ్బులు పంపించవద్దని సర్వేయర్లకు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు సమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment