MRO offfices
-
ఓ సైబర్ అపరిచితుడు.. సర్వేయర్లే టార్గెట్‌గా..!
మహబూబాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు జాబ్స్ పేరిట.. లంచాలు తీసుకున్న వారిని ఏసీబీ కేసు నుంచి తప్పిస్తామంటూ టోకరా వేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి ఓ వ్యక్తి పాల్పడగా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకుంటూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోని సర్వేయర్‌గా పని చేస్తున్న కొందరు ఉద్యోగులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. మోసానికి పాల్పడుతున్న తీరు ఇలా.. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న సర్వేయర్లతో తనకు తాను ఏసీబీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీరు లంచాలు తీసుకున్నారని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ సర్వేయర్‌గా పని చేస్తున్న మల్లయ్యకు ఈ నెల 16న ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు లంచం తీసున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ కేసు నుంచి నిన్ను తప్పించేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. అదే రోజు పర్వతగిరి మండలంలో పని చేస్తున్న సర్వేయర్ శ్యామూల్‌కు అదే వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కేసు నమోదు చేస్తామని ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని సర్వేయర్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంతటితో ఆగకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని పలువురు సర్వేయర్లకు ఫోన్లు చేసి ఏసీబీ కేసుల నుంచి మిమ్మలను తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఇందుకోసం గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. సందేహం వచ్చిన సదరు ఉద్యోగులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడితో జరిగిన సంభాషణ, ఫోన్ నంబర్ వివరాలు అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల ముసుగులో సర్వేయర్లను నమ్మించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. సదరు నిందితుడికి డబ్బులు పంపించవద్దని సర్వేయర్లకు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు సమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
వీఆర్ఏలకు గార్డు విధులు!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మహిళా తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయోగం చేపట్టింది. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)కు కొత్త రూపు ఇచ్చింది. వారికి ‘రక్షణ’ విధులు అప్పగించింది. రెవెన్యూ ఉద్యోగుల భద్రత, సందర్శకుల రాకపోకలపై కన్నేసి ఉంచేందుకు సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే ప్రజల్లో కొందరు తమ సమస్యలు పరిష్కారం కావట్లేదనే ఆక్రోశంతో అధికారులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ 4న తహసీల్దార్ విజయారెడ్డిని పట్టపగలు ఆమె కార్యాలయంలోనే ఓ రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన ఈ కోవలోనిదే. విజయారెడ్డి సజీవదహనంతో అవాక్కయిన రెవెన్యూ యంత్రాంగం... వారం పాటు విధులు బహిష్కరించింది. తమకు రక్షణ కల్పిస్తే తప్ప విధులు నిర్వహించలేమని స్పష్టం చేసింది. రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించడంతో రంగంలోకి దిగిన సర్కారు రెవెన్యూ ఉద్యోగుల విధుల నిర్వహణకు పోలీసు రక్షణ కల్పించింది. కానీ క్రమేణా కానిస్టేబుళ్లను వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యానే నిర్మల్ జిల్లా అధికారులు వీఆర్ఏలకు సెక్యూరిటీ గార్డు విధులు అప్పగించాలని నిర్ణయించారు. డ్రెస్‌కోడ్‌తో కొత్త అవతారమెత్తిన వీఆర్ఏల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే మండల కార్యాలయాలు, అధికారుల వద్ద ఆర్డర్లీ సేవలందిస్తున్న వీఆర్ఏలను తాజాగా సెక్యూరిటీ గార్డులుగా నియమించడంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. ప్రతి మండలం నుంచి ముగ్గురు... నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో రెవెన్యూ అధికారుల రక్షణ కోసం సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతి మం డలం నుంచి ముగ్గురు వీఆర్ఏలను అధికారులు ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు పురుషులు, ఒక మహిళా వీఆర్ఏకు స్థానం కల్పించారు. 19 మండలాల నుంచి సెక్యూరిటీ గార్డులుగా విధుల కోసం 57 మందిని ఎంపిక చేసి వారికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో అధికారులను కలిసేందుకు వచ్చే ఫిర్యాదుదారులను చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించడం, వారు వెంట తీసుకువచ్చిన చేతిసంచులు, ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ పనిపై వచ్చారనే విషయాన్ని ఆరా తీయడం, అనుమానస్పదంగా ఉంటే వారిని అడ్డుకోవడం.. తదితర అంశాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు. డ్రెస్‌కోడ్‌పై గరంగరం! వాస్తవానికి వీఆర్ఏల ప్రధాన విధి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)కి సహాయకులుగా వ్యవహరించడం. కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉండటంతో దాదాపు అన్ని మండల కార్యాలయాల్లో వీఆర్ఏల సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విడతలవారీగా ఆయా గ్రామాల వీఆర్ఏలను మండల ఆఫీసుల్లో విధులకు నియోగిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం, ఆ తర్వాత కొన్ని మండలాల్లోనూ పెట్రోల్ సీసాలు, భౌతికదాడులకు పాల్పడతామంటూ కొందరు ఫిర్యాదుదారులు హెచ్చరికలకు దిగడంతో నిర్మల్ జిల్లా యంత్రాంగం వీఆర్ఏలను సెక్యూరిటీ గార్డులుగా మార్చేసింది. అయితే విధుల నిర్వహణపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా డ్రెస్‌కోడ్‌పై మాత్రం ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతవిద్య అభ్యసించి వీఆర్ఏలుగా పనిచేస్తున్న తమకు డ్రెస్‌కోడ్‌ను వర్తింపజేయడం అవమానపరచడమేనని మండిపడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, తక్షణమే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం భూపరిపాలన శాఖ డైరెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. -
తహసీల్‌కు తాళం !
సాక్షి, రంగారెడ్డి : తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలు వారం రోజులుగా తెరుచుకోవడం లేదు. ఉద్యోగులు కార్యాలయాలకు అరకొరగా వస్తున్నా.. విధులకు దూరంగా ఉంటున్నారు. తహసీల్దార్ హత్యను ఖండిస్తూ గత వారంలో మూడు రోజులపాటు రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సయమంలో దాదాపు అన్ని తహసీల్దార్కార్యాలయాలకు తాళం కనిపించింది. అయితే, తమకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు ఆ తర్వాత కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. కనీసం సోమవారమైనా ప్రజావాణి నిర్వహిస్తారని, కార్యాలయాలు తెరచుకుంటాయన్న నమ్మకంతో సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లిన బాధితులకు నిరాశే మిగిలింది. గ్రామీణ ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా 21 తహసీల్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో 15కుపైగా తాళం వేసి ఉన్నాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లారు. ఈ విషయం తెలియని రైతులు, ప్రజలు ఆయా పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చారు. వ్యయ ప్రయాసాలకు ఓర్చి కార్యాలయాలకు వస్తే ఒక్క పని కూడా కావడం లేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇంకెన్ని రోజులు విధులకు రారోనంటూ వెనుదిరిగారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. అధికారులు వస్తారేమోనని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వారం రోజులుగా తిరుగుతున్నా. నాకు మైసిగండి గ్రామంలో 9 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో ఏడు గుంటల భూమి నమోదైంది. రికార్డుల్లో భూమి తక్కువగా నమోదు కావడంతో ఆన్లైన్లో సరిచేసుకుందామని తహసీల్దార్ కార్యాలయానికి రోజూ వస్తున్నా. మైసిగండి నుంచి కడ్తాల్‌కు రావడం.. కార్యాలయం మూసి ఉండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవడం జరుగుతోంది. రోజూ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పోతుండటంతో వేరే పనులు చేసుకోలేకపోతున్నా. ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – జవహర్లాల్, మైసిగండి, కడ్తాల్ మండలం ప్రభుత్వం స్పందించాలి భూమికి సంబందించి పాత రికార్డులు పట్టుకుని రోజూ తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నా. వారం రోజులుగా కార్యాలయం మూసే ఉంటుంది. ప్రభుత్వం స్పందించి తహసీల్దార్ కార్యాలయాలు తెరిచేలా చర్యలు చేపట్టాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి. – సుందర్, మైసిగండి -
తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
యాచారం: భూరికార్డులు ధరిణి వెబ్సైట్లో నమోదు చేయడం లేదని ఓ రైతు తహసీల్దార్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైతులు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆ రైతు చేతిలో ఉన్న పురుగుల మందును లాక్కోవడంతో ప్రాణపాయం తప్పింది. యాచారం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పదేళ్ల క్రితం సర్వే నంబరు 877లో గ్రామానికి చెందిన వల్లవోతు మల్లయ్య, మైసయ్య రైతుల వద్ద ఎకరా భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ చేయించుకున్న రైతు జంగయ్య ఆన్లైన్లో నమోదు చేసుకోలేదు. కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందిస్తుండడం వల్ల ఆ డబ్బులు వస్తాయని ఆశతో ఏడాదిగా యాచారం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యవారిగూడెం రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను పలుమార్లు కలువగా స్పందన లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం సాయంత్రం రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేయడంతో రెవెన్యూ కార్యదర్శి జగదీష్ బదిలీ అయిపోతే తనకు రైతుబంధు రాదోనని ఆందోళనకు గురైన రైతు జంగయ్య శుక్రవారం ఉయం 10.30 గంటల నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దే ఉన్నాడు. ఎకరా భూమి ఆన్లైన్ నమోదు చేసే విషయంలో సరైన విధంగా స్పందన లేకపోవడంతో మనుస్తాపానికి గురైన జంగయ్య సాయంత్రం 4 గంటల సమయంలో యాచారం వెళ్లి పురుగులు మందు కొనుగోలు చేసుకుని వచ్చి తహసీల్దార్ పుష్పలత ఎదుటే తన భూమి ఆన్లైన్లో నమోదు చేస్తారా... లేదా చవమంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతలోనే చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా మూతి తీసి తాగేలోపే అక్కడే రైతులు, రెవెన్యూ సిబ్బంది గమనించి పురుగుల మందు సీసాను లాక్కొన్నారు. క్షణాల్లోనే జరిగిన సంఘటనకు ఉలికిపడిన తహసీల్దార్ రైతుపై తీవ్రంగా మండిపడుతూ చస్తారా... చస్తే భూమి ఆన్లైన్ అవుతుందా.. ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకరావాలి అంటు అన్నారు. రెండు రోజుల్లో నీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆ రైతు శాంతించి వెళ్లిపోయాడు. ఇదే విషయమై రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను సంప్రదించగా అయ్యవారిగూడెంలోని 877 సర్వే నంబరులో 10.21 ఎకరాలు భూమి ఉండగా, ఎకరా భూమి అదనంగా నమోదైందని, ఆ భూమిని తహసీల్దార్ అనుమతితో రికార్డుల నుంచి తొలగించడం కోసం ఆర్డీఓ అనుమతి కోసం పంపాను. రెండు, మూడు రోజుల్లో సరిచేస్తానని తెలియజేశాను. ఇంతలో ఆ రైతు ఆత్మహత్యయత్యానికి యత్నించడం బాదేసిందని అన్నారు. రైతు జంగయ్య రైతును ఇబ్బంది పెట్టలేదని, సాంకేతిక సమస్య వల్ల ఆన్లైన్లో ఎకరా భూమి నమోదు చేయలేదని తెలిపారు. -
ఆగనే ఆగదు..
కోహెడరూరల్(హుస్నాబాద్): ఒకరి అవకాశం మరొకరికి ఆసరాగా మారడం అంటే ఇదే నేమో... అధికారులందరూ ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండటంతో ఇసుకాసురులు అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలించి జోరుగా డంపు చేస్తున్నారు. ఆ నిల్వను రాత్రి వేల టిప్పర్లు, లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు సైతం మామూలుగా తీసుకోవడంతో అక్రమార్కులకు పండుగా చేసుకొంటున్నారు. సాధారణ రోజులకంటే రేట్టింపు ధరలకు ఇసుకను అక్రమ వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదు. అధికారుల అండదండలతోనే... మండలంలోని రాంచంద్రాపూర్, తంగళ్లపల్లి, కూరెల్లతో పాటు పలు గ్రామాల్లో అధికారులు అండదండలతో ఇసుక వ్యాపారం మూడు పూవ్వులు ఆరుకాయలుగా వ్యాపారం సాగుతుంది. మోయతుమ్మెద వాగు నుంచి భారీగా ఇసుక తరలిస్తున్న అధికారులు స్పందించకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసుత్తం రెవెన్యూ అధికారులు సోమవారం నుంచి గురువారం వరకు ఇసుక అనుమతి ఇస్తున్నారు. దీనిని అదనుగ భావించిన దళారులు గ్రామాల్లో ఇసుక డంపులు వేస్తూ రాత్రిల్లు సిద్దిపేటతో పాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతి ముసుగులో దళారులు తమ వ్యాపారానికి పదును పేట్టారు. ఎక్కడ ఆవకాశం దొరికిన సోమ్ము చేసుకుంటున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక.. అవును మీరు విన్నది నిజమే ఇసుక అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సాధారణ సమయంలో కంటే ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఇసుక రూ.5నుంచి 7వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అలాగే ఒక లారీ 40నుంచి 50వేలకు హైదారాబాద్ ప్రాంతాలకు విక్రయిస్తునట్లు సమాచారం. కూలీలతో ఇసుక నింపితే బయట తెలుస్తుందని దళారులు ఏకంగా జేసీబీ ఉపయోగిస్తున్నారు. సమాచారం అందించినా.. నెల రోజుల క్రితం మండలంలోని ఒక గ్రామంలో ఇసుక డంపు ఉందని గ్రామస్తులు రెవెనూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఇసుక డంపును వీఆర్ఏ సహాయంతో గుర్తించిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో బేరం కుదుర్చుకుని చూసి చూడనట్లు వ్యవహరించారు. దీంతో అదే రోజురాత్రి డంపు మాయం చేశారు. వ్యాపారులు.అధికారులకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందించిన స్పందించకపోవడం, పట్టుబడిన ట్రాక్టర్లను సైతం కార్యాలయానికి తరలించాక విడిచిపేట్టడంతో ప్రజలు అనూమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు... అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ పనులను బట్టి ఇసుక అనుమతి ఇస్తున్నాం. గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుక తరలింపుపై నిఘా పేడతాం. ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు నిర్ధేశ సమయంలో ఇసుక అనుమతి ఇచ్చాం. – అనిల్‌కుమార్, తహసీల్దార్ కోహెడ -
తహసీల్దార్ల బదిలీ!?
తహసీల్దార్లు జ్యోతి, రామకృష్ణ ఇద్దరు యాదాద్రి జిల్లా నుంచి బదిలీపై నల్లగొండ జిల్లాకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి పి.వీరేశం, ఆంజనేయులు, చంద్రశేఖర్, మహబూబ్ అలీ, శ్రీదేవి, ఎం.రాజేశ్వరి, అరుణ జ్యోతి, కార్తీక్, దామోదర్ రావు, విజయశ్రీ, జి.కృష్ణలు జిల్లాకు బదిలీపై రాగా, రంగారెడ్డి జిల్లా నుంచి ఆర్.బాలరాజు వస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి 23 మంది బయటి జిల్లాలకు వెళ్తుండగా, 14 మంది పక్క జిల్లాలనుంచి వస్తున్నారు. సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీచేశారు. అయితే అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పది రోజులనుంచి అధికారులు బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఓటరు తుది జాబితా ప్రకటన ఉన్నందున ఆపారు. శనివారం జాబితా ప్రకటించగానే బదిలీల ప్రక్రియను మొదలుపెట్టారు. సొంత జిల్లా, సర్వీస్ బుక్ ఆధారంగా బదిలీలను చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొదట పాత జిల్లాల ప్రాతిపదికన కొనసాగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కానీ ఎన్నికల సంఘం కొత్త జిల్లాను కలుపుతూ అవకాశం ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనే బదిలీ చేశారు. నల్లగొండ జిల్లానుంచి మొత్తం 23 మంది బదిలీ అయ్యారు. వీరిని సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్‌కు బదిలీ చేయగా, సూర్యాపేట, రంగారెడ్డి నుంచి 14 మంది తిరిగి నల్లగొండకు వస్తున్నారు. అయితే వీరి బదిలీ ఉత్తర్వులు అధికారికంగా రావాల్సి ఉంది. సర్వీస్ బుక్ ఆధారంగా తహసీల్దార్ల సర్వీస్ బుక్ ఆధారంగా బదిలీలను చేశారు. అదే విధంగా మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేసే వారికి కూడా బదిలీ చేశారు. జిల్లా వారికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఇతర జిల్లాకు బదిలీ చేశారు. -
రిజిస్ట్రేషన్లకు ఆటంకాలెన్నో..!
సాక్షి,ఆదిలాబాద్ : తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మూడుచోట్ల ప్రారంభించగా, నామమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కొత్తగా ఈ ప్రక్రియ ప్రారంభించడంతో రానురాను గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ధరణి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడం తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకమవుతుందని అధికారుల నుంచి వినిపిస్తున్న వాదన. లోపభూయిష్టంగా ఉన్న ఈ విధానం కారణంగా ఒత్తిడిలో పనిచేయలేమని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 20 నుంచి ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నామమాత్రంగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మే 19న మూడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, నిర్మల్ జిల్లా నిర్మల్‌రూరల్, మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. గుడిహత్నూర్, నెన్నెలలో నామమాత్రంగా రిజిస్ట్రేషన్లు కాగా, నిర్మల్రూరల్లో కొంత పర్వాలేదనిపించింది. అయితే అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సహకారంతోనే తహసీల్దార్లు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం కూడా ఆటంకం కలిగిస్తుంది. ప్రధానంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రతీ అంశంలో ఒక్కో సిబ్బంది అందుబాటులో ఉంటారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌తో పాటు ఆపరేటర్, సబార్డినేట్ మినహా ఇతర సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ప్రస్తుతం ధరణి ప్రాజెక్టు కింద భూ వివరాలను క్రోడీకరించడం రెవెన్యూ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా ఉంది. ప్రస్తుతం పాస్పుస్తకాల్లోనూ పెద్ద ఎత్తున తప్పులు దొర్లడంతో వాటిని సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. ఇటు రెవెన్యూకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న అధికారులు రిజిస్ట్రేషన్ మీద దృష్టి సారించలేకపోతున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేపడదామన్నా ధరణికి సంబంధించి వెబ్సైట్ పూర్తిగా సిద్ధం కాకపోవడం పెద్ద ఆటంకంగా మారింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఇతర అంశాల పరంగా ప్రక్రియలను చేపట్టలేకపోతున్నారు. పట్టా మార్పిడి ఆప్షన్ ఇప్పటికీ రానట్టు చెబుతున్నారు. అదేవిధంగా కరెక్షన్లకు సంబంధించి ఎలా చేపట్టాలో స్పష్టత లేకపోవడం కూడా సిబ్బంది ఇబ్బందులకు కారణమవుతోంది. ఒక రిజిస్ట్రేషన్‌ను రద్దు (క్యాన్సలేషన్) చేయాలన్న దానికి కూడా ఆప్షన్ రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతీ అంశంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో రిజిస్ట్రేషన్ చేపడతామన్న ధీమా కనపడటం లేదని ఓ అధికారి చెప్పారు. ధరణి వెబ్సైట్ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చనందునా అన్నిరకాల సవరణలు చేసే అవకాశం అమల్లోకి రాలేదని, వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్లు కూడా సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ధరణి వెబ్సైట్ నిర్వాహకులు నియమించిన సిబ్బందికి సరైన నైపుణ్యత లేదని, కావాల్సిన అర్హతలు కూడా వారికి లేవని అధికారులు చెబుతున్నారు. వారిని వెంటనే వెనక్కి పంపించి నిపుణులను ఎంపిక చేసే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వాలని అభిప్రాయ పడుతున్నారు. ధరణి వెబ్సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించాలని చెబుతున్నారు. అంతకుముందు సిబ్బంది, మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒత్తిడి.. ఓ వైపు రెవెన్యూ సంబంధిత పనుల్లో బిజీగా ఉంటూ మరోపక్క రిజిస్ట్రేషన్ చేపట్టడం తలకుమించిన భారంగా మారుతుందన్న అభిప్రాయం తహసీల్దార్లలో వ్యక్తమవుతుంది. రెవెన్యూ ఏతర పనులను తహసీల్దార్ల నుంచి, రెవెన్యూ సిబ్బంది నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న రెవెన్యూ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దరఖాస్తుదారుడు డాక్యుమెంట్లో సూచించిన విధంగా మోకా(స్థలం) మీద పరిశీలన జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. స్థలాన్ని పరిశీలించిన పక్షంలో డాక్యుమెంట్లో పొందుపర్చిన అంశాలు పూర్తిగా సరైనవా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా డాక్యుమెంటేషన్‌లో భూమి విస్తీర్ణం అధికంగా చూపడం, మోకా మీద భూమి తక్కువగా ఉండటం అంశాల కారణంగా అమ్మకం, కొనుగోలుదారుల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు ఈ బాధ్యతను అప్పగించిన తర్వాత అయినా స్థల పరిశీలన చేసి రిజిస్ట్రేషన్ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం లేకపోలేదు. అదే సమయంలో తహసీల్దార్లపై కూడా రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ధరణి పూర్తయితేనే రిజిస్ట్రేషన్లు ధరణి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేపట్టడం సులువుగా ఉంటుంది. గతంలో ఉన్న వెబ్‌ల్యాండ్ పిరియడ్ అయిపోయింది. ధరణికి సంబంధించి అన్ని అంశాలు ఆన్లైన్లో రాకపోవడం ఇబ్బందిగా ఉంది. పట్టా మార్పిడి ఆప్షన్ లేదు. సవరణ చేద్దామన్నా ఆ ఆప్షన్ కూడా లేదు. రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్, ఇతరత్రా అంశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది సహకారం తీసుకొని ప్రస్తుతం చేపడుతున్నాం. – మోతీరాం, తహసీల్దార్, గుడిహత్నూర్ -
తహసీల్దారు కార్యాలయాలకు భవనాలు
సీసీఎల్ఏకు ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న మండల తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మా ణం, సొంత భవనాల్లో ఉన్న కార్యాలయాల్లో ఆధునీకరణ పనులకు సర్కారు అంగీకారం తెలిపింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం ఇప్పటికే మంజూరు చేసిన రూ.10 కోట్లను వెంటనే అవసరమైన ప్రాంతాలకు కేటాయించాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ)ను సర్కారు ఆదేశించింది. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, తహసీల్దార్ల సంఘాలు చేసిన ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీఎల్ఏకు ప్రభుత్వం సూచిం చింది. అదనపు బడ్జెట్ అవసరమైనపక్షంలో తగిన ప్రతిపాదనలను పంపాలని సీసీఎల్ఏకు సర్కారు తాజాగా మెమో జారీచేసింది. సీసీఎల్ఏకు సర్కారు ఆదేశాలు ఇవీ.. - అద్దె వాహనాలు వినియోగించే మండల తహసీల్దార్లు, ఆర్డీవోలకు అదనపు బడ్జెట్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలి. - పనిభారం మేరకు తహసీల్దార్ కార్యాలయాలను విభజించే అంశాన్ని పరిశీలించాలి. విద్యుత్ బిల్లులు చెల్లించని కార్యాలయాలకు వెంటనే సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. నిధుల ప్రతిపాదనలు పంపాలి. - ఆహార భద్రత కార్డుల జారీ సమయంలో తహసీల్దార్లు చేసిన ఖర్చును పౌరసరఫరాల విభాగం ఇవ్వనందున, కార్డుకు రూ.10 చొప్పున తహసీల్దార్లకు వెంటనే చెల్లించాలి. - కోర్టు కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులకు న్యాయ సలహాలను పొందేందుకు ప్రతి జిల్లాకు ఒక న్యాయవాదిని నియమించుకోవాలి. - డీటీలుగా పదోన్నతులు పొందేందుకు అర్హులైన తహసీల్దార్ల జాబితాను పంపాలి. కలెక్టరేట్లో ఉండే అదనపు జేసీల పని పంపిణీ ప్రతిపాదనలను పంపాలి. - ‘ఈ-ధాత్రి’పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. - జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోని సూపరింటెండెంట్ పోస్టులను తహసీల్దారు కేడర్‌కు, ఏవో పోస్టును డిప్యూటీ కలెక్టర్ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది.