ఆర్టీపీపీపై కుట్రను అడ్డుకోండి
ఎర్రగుంట్ల: రాయలసీమకు వెలుగునిచ్చే ఆర్టీపీపీని తాకట్టు పెట్టేందుకు కుట్ర జరుగుతుందని, దానిని అందరూ కలిసి అడ్డుకోవాల్సి ఉందని కార్మికసంఘాలు కోరారు. ఆర్టీపీపీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మంగళవారం ఆర్టీపీపీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్టీపీపీని పరిరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. తర్వాత ఆర్టీపీపీ గేటు వద్ద నుంచి కార్మిక సంఘాలు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి పరిపాలన విభాగం ఎదుట ఆర్టీపీపీ సీఈ సుబ్రమణ్యంరాజుకు వినతిపత్రం అందించారు. తదుపరి ఏపీజెన్కో ఎండీకి, ఇంధన కార్యదర్శిని కలిసి విన్నవించడం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను కలిసి ఆర్టీపీపీ సమస్యలను వివరించడం, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి ఆర్టీపీపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరడం తదితర నిర్ణయాలను చేయాలని కమిటి తీర్మానం చేసినంట్లు కార్మిక సంఘాలు నాయకులు తెలిపారు.