ఆర్తనాదాలతో దద్దరిల్లిన రుయా
⇒ఏర్పేడు రోడ్డు ప్రమాద మృతులకు రుయాలో పోస్టుమార్టం
⇒రైతుల మృతికి పోలీసులు, రెవెన్యూ అధికారులు, బొజ్జల అనుచరులే కారణం
⇒మార్చురీ వద్ద ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్
తిరుపతి మెడికల్, అలిపిరి : ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో తిరుపతి రుయా ఆస్పత్రి దద్ధరిల్లింది. మృతులను చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ముసిలిపేడుకు చెందిన దేవతమ్మ కొడుకు ఎం.హరిబాబు(45), తమ్ముడు ఎం.బాబు (47) మృతి చెందడం, హరిబాబు కొడుకు సాయి గాయాల పాలవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
తమ గ్రామ సరిహద్దులో మాజీ మంత్రి బొజ్జల అనుచరుడు ధనంజయులునాయుడు, చిరంజీవి నాయుడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, దీన్ని అడ్డుకున్నందుకు కక్ష గట్టి తమను లారీ రూపంలో చంపించారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీదేవి, సీపీఎం నాయకులు కందారపు మురళి, రైతు సంఘం నుంచి నాగరాజు, జయచంద్ర, సీపీఐ నుంచి వెంకయ్య, చిన్నం పెంచలయ్య, రామానాయుడు, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, కన్వీనర్ విజయభాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
రూ.25లక్షలు పరిహారం చెల్లించాలి..
ప్రమాదంలో మరణించిన వారికి రూ.25లక్షలు, గాయపడ్డ వారికి రూ.15లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నాడని తెలిపారు. ఇసుకను తరలిస్తూ దొరికిపోయిన వారిపై ఎలాంటి కేసూ నమోదు చేయడం లేదన్నారు. ఇందులో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు రోజువారీ మామూళ్లు వెళుతున్నాయని ఆరోపించారు. దీన్ని రైతులు అడ్డుకుంటే వారిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు పెడతానంటూ సీఐ బెదిరించడం దారుణమన్నారు.
ఇసుక మాఫియా కారణం కాదు
ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో రైతులు మృతి చెందిన ఘటనకు, అక్కడ జరుగుతున్న ఇసుక మాఫియాకు ఎలాంటి సంబంధమూ లేదని సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య తెలిపారు. రుయా మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడుతూ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దీన్ని ఇసుక మాఫియా కింద చూడకూడదని అన్నారు.
విచారిస్తున్నాం..
ఏర్పేడు ఘటన పూర్తిగా రోడ్డు ప్రమాదమని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. దీన్ని ఇసుక మాఫియాతో పోల్చకుండా ప్రత్యేకంగా విచారించాలన్నారు. ఈ ఘటనలో రైతులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారని, ప్రాథమిక విచారణలో లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడం వల్లే జరిగినట్టు తేలిందని అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు.