అందుకే సినిమాల్లో నటించడం లేదు
కరీనా కపూర్, ఐశ్వర్యా రాయ్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. కాగా పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి మాత్రం వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. 2008లో వచ్చిన దోస్తానా ఆమె చివరి చిత్రం. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన శిల్పా ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం గురించి శిల్పా మాట్లాడుతూ.. తనకు అవకాశాలు వచ్చాయని, అయితే చెత్తపాత్రలు కావడంతో తిరస్కరించాని చెప్పింది. ఇలాంటి పాత్రల్లో నటించి సమయం వృథా చేసుకోలేనని అంది. గతంలో తాను నటించిన సినిమాల పట్ల సంతృప్తిగా ఉందని, ఇకముందు ఆసక్తికర పాత్రల్లో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తానని చెప్పింది.
సినిమాల్లో నటించకున్నా తాను అభిమానులకు దూరం కాలేదని, టీవీల్లో తనను చూస్తూనే ఉన్నారని శిల్పా చెప్పింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నట్టు తెలిపింది.