ఆర్ఈఐటీ నిబంధనల మార్పునకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ల నిబంధనలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సలహాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వీటి ఆస్తుల కనీస పరిమాణాన్ని రూ. 1,000 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అధిక రిస్క్‌ల నేపథ్యంలో తొలి దశకింద పెద్ద ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిలో పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించేందుకు ప్రతిపాదించింది. వెరసి కనీస పెట్టుబడి పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లతోపాటు, దేశీ బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ తదితరాలు వీటిలో ఇన్వెస్ట్‌చేసేందుకు వీలు కల్పించింది. ఆర్ఈఐటీ నిబంధనలతోపాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్స్)లకు సంబంధించిన మార్గదర్శకాలకు కూడా ఈ నెల 10న(ఆదివారం) జరగనున్న సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇన్ఫ్రా రంగానికి అవసరమయ్యే రూ. 65 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించే యోచనతో ఇన్విట్స్కు తెరలేపింది. సెబీ బోర్డు సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యే అవకాశముంది. జైట్లీ ప్రకటించిన సాధారణ బడ్జెట్లో రియల్టీ, ఇన్ఫ్రా ట్రస్ట్‌లలో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.