జాతీయాలు
పరశురామప్రీతి
అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. పరశురాముడికి అగ్నికి సంబంధం ఏమిటి? శివుడిని మెప్పించి పరశువు(గండ్రగొడ్డలి)ని ఆయుధంగా పొందుతాడు పరశురాముడు.
ఇక పరశురామప్రీతి విషయానికి వస్తే...
కార్తవీర్యుని కొడుకులు పరశురాముని తండ్రి జమదగ్ని తలను నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక జమదగ్ని శవంపై ఏడుస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకుంటుంది. ఎన్నిసార్లు తల్లి గుండెలు బాదుకుందో అన్నిసార్లు క్షత్రియులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు పరశురాముడు. కార్తవీర్యుని రాజధాని నగరాన్ని ఆగ్నేయాస్త్రంతో భస్మం చేస్తాడు. ఊరంతా తగలబడిపోతుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడాన్ని ‘పరశురామ ప్రీతి’గా పేర్కొనడం వాడుకలోకి వచ్చింది.
ఉత్తారాషాఢ పూర్వాషాఢ
చమత్కారం కోసమో, మర్యాద కోసమో... కొన్ని రోగాలను ప్రత్యామ్నాయ పేర్లతో పిలుస్తుంటారు. ఈ క్రమంలో నుంచి వచ్చిందే ఉత్తరాషాఢ పూర్వాషాఢ.
* ఉత్తరాషాఢ, పూర్వాషాఢ అనేవి రెండు నక్షత్రాలు.
హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల... ఇలా నక్షత్రాలను లెక్కిస్తున్నప్పుడు ఈ రెండు నక్షత్రాలు పక్క పక్కనే వస్తాయి.
* అనారోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు జంటగా వస్తే లేదా పరిస్థితి తారుమారైతే...
* ‘ఉత్తరాషాఢ పూర్వాషాఢలా ఉంది’ అంటారు.
ముఖ్యంగా... వాంతులతో పాటు విరేచనాలు అయినప్పుడు ఎక్కువగా ఈ మాటను ఉపయోగిస్తారు.
రుద్రాక్ష పిల్లి!
చెప్పిందొకటి చేసేదొకటిగా ప్రవర్తించే వాళ్లను ‘రుద్రాక్ష పిల్లి’తో పోలుస్తారు.
‘చెప్పేవి శాంతివచనాలు... చేసేవి రౌడీపనులు. అతడొక రుద్రాక్ష పిల్లి’ అంటుంటారు.
వెనకటికో ముసలి పిల్లి మెడలో రుద్రాక్ష వేసుకొని... ఎప్పుడు చూసినా శాంతి, అహింసల గురించి తెగమాట్లాడేదట. మరోవైపు దొరికిన పిట్టను దొరికినట్లు గుటుక్కుమనిపించేదట! మాటకు, ఆచరణకు మధ్య ఉండే అంతరాన్ని సూచించే మాట ఇది.
ఊర్మిళాదేవి నిద్ర!
ఎవరైనా చాలా ఎక్కువగా నిద్రపోతే ‘ఊర్మిళాదేవి నిద్ర’తో పోల్చడం చూస్తూనే ఉంటాం. రామాయణం నుంచి పుట్టిన మాట ఇది. వనవాస సమయంలో అడవికి రాముడితో సీత వెళ్లిపోతుంటే... ‘‘నేనూ మీతో వస్తాను’’ అని భర్త లక్ష్మణుడిని అడుగుతుంది ఊర్మిళ. కానీ లక్ష్మణుడు అంగీకరించడు. ఈ సందర్భంలో... లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకు ఇస్తాడు. ఊర్మిళ తన ‘మెలకువ’ని లక్షణుడికి ఇస్తుంది. భర్త అడవిలో ఉన్నా పద్నాలుగేళ్లూ ఊర్మిళ నిద్రపోతుంది. ఈ పద్నాలుగేళ్లూ లక్ష్మణుడు అడవిలో మెలకువగా ఉంటాడు.