బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ బేగంపేటలోని రుక్మిణి టవర్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాణిజ్య సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మరోవైపు ఢిల్లీలోని ఓ అనాథాశ్రమంలో అనూహ్య రీతిలో వేకువజామున మంటలు రాజుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో మహిళ కూడా ఉంది. మృతురాలికి కాలు లేకపోవడంతో, బయటకు పరుగు తీయలేక మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇక్కడ వందల సంఖ్యలో అనాథలు, వృద్ధులు, మానసిక వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు ఆశ్రయం పొందుతున్నారు. మొత్తం పది షెల్టర్స్ ఉండగా .. అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.