పదోన్నతుల్లో రిజర్వేషన్లు రద్దు
న్యూఢిల్లీ: పదోన్నతులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రమోషన్లు కల్పించే చట్టం – 2002’ ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ చట్టం ‘కాచ్ అప్ రూల్’కు విరుద్ధమని పేర్కొంది. ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించే ముందు.. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం, పూర్తి సామర్థ్యం తదితరాలు ఉన్నాయో లేదో పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.
ఈ చట్టంలోని అంశాలు ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ సర్వీసుల అవకాశాల్లో సమానత్వం)ల పరిధి దాటి ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం తదితరాలు ఉన్నప్పుడే రిజర్వేషన్ల ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని వివరించింది.