రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమాచారం ఏదీ?
– నెల రోజుల్లో రికార్డులు అందించాలి
– బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
– ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భర్తీ చేసిన బోధన, బోధనేతర ఉద్యోగాలకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమాచారం, రోస్టర్ పాయింట్ల వివరాలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అసంతప్తి వ్యక్తం చేశారు. వర్సిటీ ఉన్నతాధికారులు, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో బుధవారం ఎస్కేయూలో ఆయన సమీక్ష నిర్వహించారు. 1981 నుంచి నియామకాలు చేపట్టిన ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు.
రోస్టర్ పాయింట్ల రిజిస్టర్, ఉద్యోగుల సమాచారం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు లేకపోతే ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయనే సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అరకొరగా సమాచారం ఇచ్చినప్పటికీ, అందులో పెన్సిల్‌తో సరిదిద్ది ఉండటం చూసి రికార్డులు తారుమారు చేస్తున్నారా? అని నిలదీశారు. అధికారులు సరైన సమాచారం అందించకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. నెలరోజుల్లోపు రికార్డులన్నీ సరిచేసి ఉంచాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను పాలకమండలి సమావేశంలో ఆమోదింపచేసి, భర్తీ చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం, ఉపకార వేతనాల మంజూరు, హాస్టళ్లలో అందించే ఆహారం, తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఒక ఉన్నతాధికారిని నియమించాలన్నారు.
పొరుగు సేవల్లోనూ రిజర్వేషన్లు
పొరుగు సేవలు(ఔట్ సోర్సింగ్) ఉద్యోగాల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని కారెం శివాజీ అన్నారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రికార్డులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. నాన్‌టీచింగ్ పోస్టులు 17, టీచింగ్ పోస్టులు 7 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు.