ప్ర‘వరుడు కావలెను’
జెంటిల్మన్
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా... పెళ్లాం ఎంత అందంగా ఉన్నా సరే, మరో పడతిని పక్కచూపులు చూడటం చాలామందికి అలవాటు. అలాంటిది... కట్టుకున్న భార్య సాదాసీదాగా ఉండి... ఎదురుగా ఎంత ముద్దుగుమ్మ ఉన్నా కనీసం కళ్లు తిప్పట్లేదంటే... అతడు భార్యావిధేయుడన్నా అయి ఉండాలి, లేదా అపర ప్రవరాఖ్యుడన్నా అయి ఉండాలి. అన్నట్లు ప్రవరాఖ్యుడంటే ఎవరో కాదు, ప్రబంధనాయకుడు. అల్లసాని వారు అతడి గురించి ఏకంగా ఓ కావ్యాన్నే రచించారు. ఇంతకీ ఎవరీ ప్రవరుడు, ఏమిటతని గొప్పదనం అంటారా..!
అతనిది అరుణాస్పదమనే ఊరు. డబ్బూ దస్కం... పాడీపంటా, ఇల్లూ వాకిలీ ఆచారమూ సంప్రదాయమూ, నిష్ఠా నియమమూ ఉన్నవాడు. వేదవిద్యాసంపన్నుడు. తాను నేర్చిన వేదపాఠాలను పదిమందికీ చెప్పే సుశిక్షితుడైన గురువు. నిరంతరం మాతాపితరుల సేవలో తరించేవాడు, నిత్యాగ్నిహోత్రుడు. అతిథికి అన్నం పెట్టనిదే పచ్చిగంగ కూడా ముట్టని ఆదర్శ గృహస్థు. అన్నింటికీ మించి చక్కదనాల చుక్క అయిన సోమిదమ్మకు ముద్దుల మగడు. అటువంటి ప్రవరుడు ఒక సిద్ధుడిచ్చిన పాదలేపనం సాయంతో హిమాలయాలకు వెళ్లాడు. అయితే ఆ లేపనం కరిగిపోవడంతో తిరిగి రాలేక దారికోసం వెతుకుతుండగా... ఓ అతిలోక సౌందర్యరాశి అతణ్ణి చూసి మనసు పారేసుకుంది. ఆ కాంత ఎవరో కాదు, వరూధిని అనే అప్సరస. ఆమె అందచందాలను అల్లసాని వారు ఎలా వర్ణించారంటే...
మెరుపు తీగలాంటి ఒళ్లు, కలువల్లాంటి కళ్లు, నల్లద్రాక్ష గుత్తుల వంటి కనుగుడ్లు, తుమ్మెదలాంటి నల్లని జుట్టు, చంద్రబింబం లాంటి ముఖం, పగడాల్లాంటి పెదవులు, లోతైన నాభి. హంసలాంటి నడక. గరుడ పచ్చల భవనంలో... చంద్రకాంత మణులు పొదిగిన పీటపై కూర్చొని తామరతూళ్లలాంటి అందమైన వేళ్లతో వీణ తీగలను మీటుతూ... పాట పాడుతూ వుంటే పడి పోని వారుండరు. అంతటి అందాల భామ ప్రవరుణ్ణి చూసి...
‘ఆహా ఈ అందగాని కళ్లు కమలాలే! ఛాతీ మన్మధుని సింహాసనంలా ఉంది. పాదాలు ఎర్రని ముఖమల్ తివాచీని ధిక్కరిస్తున్నాయ్. సూర్యుణ్ని సానబట్టి పొడి తీసి ఆ బంగారు అడుసులో ఈ రజను కలిపి, దానిపై కాస్తంత అమృతాన్ని చిలకరించి మరీ ఆ బ్రహ్మ ఇతణ్ణి సృష్టించాడా అన్నంత అందంగా ఉన్నాడే... ఇతణ్ణి చూస్తూంటే నా మనసు, శరీరం వశం తప్పుతున్నాయే, మన్మధ తాపం నా మనస్సును వివశం చేసేస్తోంది... అసలింతటి సౌందర్యవంతుణ్ని నేను ఇన్నాళ్లూ చూడకుండా ఎలా ఉన్నానో...’ అని వాపోయిందట. అలా వాపోయి ఊరుకోలేదు.
అతణ్ణి అనేక విధాలుగా కవ్వించింది. ఎంతో పుణ్యం చేస్తే తప్ప అందని స్వర ్గసుఖాలను ఇప్పుడే అందిస్తా రమ్మని రెచ్చగొట్టింది. చలించకపోయేసరికి తానుగా వచ్చి బిగి కౌగిట బంధింప జూసింది. అయినా అతను కేశమెత్త్తు కూడా కదల్లేదు. అపురూప లావణ్యవతి.. అమూల్యమైన మణిమాణిక్యాలకూ, అంతులేనంత సంపదకూ సామ్రాజ్ఞి అయిన వరూధిని క్రీగంటి చూపులకే కలల్లో తేలిపోయేవారున్నారుగానీ, తానుగా కోరి వచ్చినా కళ్లు తిప్పని నిష్ఠాగరిష్ఠుడు మన నాయకుడు. కళ్లు మిరుమిట్లు కొలిపే అందం రారమ్మంటూ కవ్విస్త్తుంటే... ‘‘అయ్యో! సాయం సంధ్య వార్చే సమయం మించిపోతున్నదే, శిష్యులకు వేదశిక్షణ ఇచ్చే వేళ మీరుతున్నదే! నా తలిదండ్రులు నాకోసం తల్లడిల్లుతుంటారే, నా ఇల్లాలు నా గురించి వెదుకుతుంటుందే’’ అని ఆలోచించాడంటే... అతనిలాంటి అందగాడు, యోగ్యుడు, గుణవంతుడు అయిన వరుడి కోసం అమ్మాయిలు వెయ్యి లెన్సులు పెట్టుకుని వెతికినా తప్పు లేదు కదా! ఈలోగా ప్ర‘వరుడు’ కావలెను అని ఓ ప్రకటన ఇచ్చేస్తే పోలా!?
- డి.వి.ఆర్.