rumarous
-
ఇక ఆపుతారా?
‘‘ఓ సారి యాక్టర్, ఇంకోసారి క్రికెటర్, ఈసారేమో డాక్టరట. ఈ రూమర్స్ అన్నీ వింటుంటే నేనేదో పెళ్లి కొడుకులను షాపింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రేమించాలి, ప్రేమలో ఉండాలని నాకూ ఉంటుంది. కానీ ఇలాంటి రూమర్స్‌ని, అదీ నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన వార్తలను ఎప్పటికీ సహించను’’ అని ఘాటుగా స్పందించారు తమన్నా. అమెరికాలోని ఓ డాక్టర్‌తో తమన్నా త్వరలో మూడు ముళ్లు వేయించుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందులో ఎటువంటి నిజం లేదని, అవన్నీ కేవలం పనిలేని వాళ్లు పనిగట్టుకొని చేస్తున్న పని అంటున్నారు తమన్నా. ఈ విషయాన్ని తమన్నా వివరిస్తూ – ‘‘ప్రస్తుతానికైతే సింగిల్‌గా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా అమ్మానాన్నలు కూడా నాకు పెళ్లి కొడుకుని చూడటంలేదు. ప్రస్తుతానికి నా సినిమాలతో నేను ప్రేమలో ఉన్నాను. షూటింగ్స్‌తో నేను బిజీగా ఉంటేæ ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయో అర్థంకాదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే అప్పుడు స్వయంగా అనౌన్స్ చేస్తాను. ఈ విషయం గురించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవడం లేదు. ఇలాంటి అవాస్తవ వార్తలను రాయడం ఆపేస్తారని అనుకుంటున్నాను’’ అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తమన్నా క్వీన్ హిందీ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’, వెంకటేశ్–వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
ఇదేం దెయ్యం గోల..!
పార్వతీపురం స్వీపర్ వీధిలో దెయ్యం వదంతులు తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ కుటుంబం పార్వతీపురం: ఇదేమి దెయ్యం గోలరా బాబూ అంటూ శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పట్టణ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పట్టణంలోని స్వీపర్ వీధికి చెందిన ఓ కుటుంబం తమను స్థానికులు దెయ్యం పేరుతో వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ బి.సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో సమావేశం నిర్వహించి అక్కడ ప్రజలను దెయ్యం...లేదంటూ వారిని చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ప్రజలు దెయ్యం పెట్టే బాధలు మీకేం తెలుసంటూ ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు పిల్లలు కలిగిన ఓ మహిళను కాలిన గాయాలతో పట్టణంలోని స్వీపర్ వీధికి ఓ కుటుంబం తీసుకొచ్చింది. గాయాల కారణంగా నెలరోజుల క్రితం ఆమె మృతిచెందింది. అయితే ఆమె చనిపోయాక కొందరు వీధివాసులపై పడి తమ పిల్లలను అప్పగించాలని రాత్రిపూట భయాందోళనకు గురిచేస్తోందని స్థానికుల్లో పుకారు వ్యాపించింది. దీంతో ఆ వీధివాసులు మహిళ మృతిచెందిన కుటుంబ సభ్యులకు దెయ్యం రాకుండా భూతవైద్యుడ్నితెచ్చి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సూచించారు. అయితే తమ పిల్ల మంచిదని దెయ్యాలు.. భూతాలు ఉండవని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తమను వేధిస్తున్నారనే ఆవేదనతో పట్టణ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో దెయ్యం లేదంటూ ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.