పార్వతీపురం స్వీపర్ వీధిలో దెయ్యం వదంతులు
తమను వేధిస్తున్నారని పోలీసులకు
ఫిర్యాదు చేసిన ఓ కుటుంబం
పార్వతీపురం: ఇదేమి దెయ్యం గోలరా బాబూ అంటూ శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పట్టణ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పట్టణంలోని స్వీపర్ వీధికి చెందిన ఓ కుటుంబం తమను స్థానికులు దెయ్యం పేరుతో వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వెంటనే స్పందించిన పట్టణ ఎస్‌ఐ బి.సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో సమావేశం నిర్వహించి అక్కడ ప్రజలను దెయ్యం...లేదంటూ వారిని చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ప్రజలు దెయ్యం పెట్టే బాధలు మీకేం తెలుసంటూ ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి.
ఒడిశాకు చెందిన ముగ్గురు పిల్లలు కలిగిన ఓ మహిళను కాలిన గాయాలతో పట్టణంలోని స్వీపర్ వీధికి ఓ కుటుంబం తీసుకొచ్చింది. గాయాల కారణంగా నెలరోజుల క్రితం ఆమె మృతిచెందింది. అయితే ఆమె చనిపోయాక కొందరు వీధివాసులపై పడి తమ పిల్లలను అప్పగించాలని రాత్రిపూట భయాందోళనకు గురిచేస్తోందని స్థానికుల్లో పుకారు వ్యాపించింది. దీంతో ఆ వీధివాసులు మహిళ మృతిచెందిన కుటుంబ సభ్యులకు దెయ్యం రాకుండా భూతవైద్యుడ్నితెచ్చి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సూచించారు. అయితే తమ పిల్ల మంచిదని దెయ్యాలు.. భూతాలు ఉండవని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తమను వేధిస్తున్నారనే ఆవేదనతో పట్టణ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో దెయ్యం లేదంటూ ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.