runaway
-
ఆ రోబోను చంపొద్దంటూ వినతులు!
పెర్మ్: రష్యాలోని పెర్మ్ నగరంలో ఇటీవల సైంటిస్టుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చిన ప్రోమోబోకు అక్కడి ప్రజల మద్దతు పెరుగుతోంది. కస్టమర్ రిలేషన్స్‌లో సహాయకారిగా పనిచేసేందుకు తయారు చేసిన ఈ రోబో.. రోడ్డుమీద చెక్కర్లు కొట్టడానికి వెళ్లడంతో తయారీదారులు దానిని రీసైక్లింగ్ చేయాలని భావించారు. అయితే.. అనూహ్యంగా ప్రజలు రోబోకు మద్దతు పలుకుతూ దానిని చంపొద్దంటూ శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కసారి కలిసిన కస్టమర్‌ను కూడా ఎప్పటికీ గుర్తుంచుకొని వారికి సహాయం అందించేలా ప్రోమోబో రూపొందించబడింది. ఇది కొత్త కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి తోడ్పడుతుంది. అయితే, అనూహ్యంగా అది రోడ్డు మీదకు వచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకోవటంతో.. దానికి గల తిరగాలనే కాంక్షే దానిని రోడ్డు మీదకు రప్పించిందనీ, అంతమాత్రానికే దానిని చంపేస్తారా అంటూ పలువురు రోబో తరపున శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తున్నారు. దాని ఫ్రీడం కోసమే అది ఇలా చేసిందని కొందరు అంటుంటే.. మరికొ్ందరు మాత్రం అది అలా ప్రవర్తించడానికి గల కారణాన్ని తెలుసుకొని సరిచేస్తే సరిపోతుందని దానిని రీసైక్లింగ్ చేయొద్దని సోషల్ మీడియాలో తయారీదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రెండేళ్ల చిన్నారి సాహసయాత్ర!
బీజింగ్: రెండేళ్ల చైనా చిన్నారి చేసిన సాసహయాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిన్నారి తనతో పాటు ఏడాది వయసున్న తమ్ముడు, చెల్లిని వెంట తీసుకొని సిటీ చూడటానికి బయలుదేరింది. ఒంటిమీద బట్టలు కూడా లేకుండా ఉన్న ఆ పాప.. ప్యాంపర్స్తో ఉన్న ఇద్దరిని వెంటబెట్టుకొని సాగించిన ఆ సాహసయాత్ర చివరికి పోలీస్ స్టేషన్లో ముగిసింది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్సులో ఓ రెండేళ్ల చిన్నారి తన ఇద్దరు సిబ్లింగ్స్ను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. జియాండే టౌన్లో అలా నడుచుకుంటూ వెళ్తన్న వారికి ఎదురైన స్థానికులు.. చిన్నారులు పెద్దవారి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్తుడటం చూసి ఆశ్చర్యపోయారు. కొందరైతే ముద్దులొలికే చిన్నారులకు లాలీపాప్‌లు కూడా ఇచ్చి సంతోషపడ్డారు. అనంతరం చిన్నారుల విషయాన్ని పోలీసులకు తెలుపగా వారు ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన చిన్నారుల తల్లి.. తాను ఇంట్లో నిద్రపోతున్న సమయంలో చిన్నారులు బయటకు వచ్చారని తెలిపింది. వేకువజామునే ఆఫీసుకు వెళ్లిన తన భర్త.. డోర్ లాక్ చేయడం మరిచాడని, అందుకే చిన్నారులు బయటకు వెళ్లారని పోలీసులకు తెలిపింది. నిద్రలేవగానే చిన్నారుల కోసం బయటంతా గాలించినా ఫలితం లేదని.. పోలీసులు తీసుకెళ్లారన్న విషయం ఓ స్థానికుడు తనకు చెప్పినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు వివరాలను సరిచూసుకొని చిన్నారులను ఆమెకు అప్పగించారు. వారు నివాసమున్నది ఓ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో అన్న విషయం విని పోలీసులు షాక్ తీన్నారు. పిల్లలను వదిలేసి గుర్రుపెట్టిన సదరు తల్లిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తుండగా.. కొందరు మాత్రం 'పాపం ఆమె తప్పేం లేదు.. పెద్దమ్మాయే(రెండేళ్లపాప) సాహసయాత్రకు బయలుదేరింది' అంటున్నారు.