కేజ్రీవాల్ పారిపోయిన పెళ్లి కొడుకు: ఖుర్షీద్
ఫరూఖాబాద్(యూపీ): ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఆయన పారిపోయిన పెళ్లికొడుకని కాంగ్రెస్ నేత, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అభివర్ణించారు. ‘మేం ఆయనకు మద్దతిచ్చి, కట్నం కింద 8 మంది ఎమ్మెల్యేలను సమర్పించుకున్నాం. అయినా పెళ్లికొడుకు పారిపోతే ఎవరేం చేయగలరు?’ అని ఆయన ఆదివారమిక్కడ అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయన్న ఆరోపణలను ఖర్షీద్ తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బాధ్యతల నుంచి పారిపోయి, రాజీనామా చేసిన కొన్నిగంటల్లోనే లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో బీజీ అయ్యారని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ విమర్శించారు. కేజ్రీవాల్ రాజీనామా విషయంలో తొందరపడ్డారని, పథకంలో భాగంగానే పదవి నుంచి తప్పుకుని ఉండొచ్చని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.