బాధ్యతలు స్వీకరించిన కొత్త అధ్యక్షులు
- నేడు టీడీపీ మినీ మహానాడు
- హాజరు కానున్న యనమల, జిల్లా మంత్రులు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పప్పల చలపతిరావులు శనివారం బాధ్యతలు చేపట్టారు. వాసుపల్లి రెండోసారి అధ్యక్షునిగా ఎన్నిక కాగా, చివరి నిముషంలో తెరపైకి వచ్చి అనూహ్య పరిణామాల మధ్య రూరల్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన వీరిరువురినీ ఇప్పటి వరకు రూరల్ అద్యక్షునిగా ఉన్న గవిరెడ్డి రామానాయుడుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు,ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్త అధ్యక్షులను అభినందనలతో ముంచెత్తారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతుకృషి చేస్తా మని ప్రకటించారు. గ్రూపులు,వర్గాలకతీతంగా పార్టీ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.
ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు జిల్లా, అర్బన్ కమిటీలపై కసరత్తు చేశారు. అర్బన్ జిల్లా కమిటీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఇరువర్గాల మధ్య తీవ్రపోటీ నెలకొంది. హర్షవర్ధన్ప్రసాద్కు ఇవ్వాలని నగర పరిధిలోని గంటా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలుపట్టుబట్టగా, అయ్యన్న వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు మాత్రం చోడే పట్టాభిరామ్ లేదా బెరైడ్డి పోతనరెడ్డిలకు ఇవ్వాలని పట్టుబట్టారు. చివరకు వెలగపూడి పంతం నెగ్గించు కుని తన అనుచరుడైన పట్టాభిరామ్‌ను ఈ కీలకపదవికి ఎంపిక చేయించగలిగారు. అర్బన్‌లో ప్రచార కార్యదర్శిగా బొట్టా వెంకటరమణ, అధికార ప్రతినిధులుగా బెరైడ్డి పోతనరెడ్డి, ప్రసాదుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా పల్లా శ్రీను, మూర్తి యాదవ్లుతో పాటు 35 మందితో అర్బన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.
కాగా అలాగే రూరల్ ప్రధాన కార్యదర్శి మినహా మిగిలిన కార్యవర్గం విషయంలో కూడా నేతల ఏకాభిప్రాయం మేరకు ప్రతిపాదించిన పేర్లను అధిష్టానం ఆమోదం కోసం పంపించారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే ఈ నెల 25వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అంకోసా ఆడిటోరియంలో జరుగనున్న మినీ మహానాడుకు జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావులతో పాటు పార్టీ జిల్లా పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలంతా హాజరు కానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లపై మధ్యాహ్నం కొత్తఅధ్యక్షుల సమక్షంలో పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమై చర్చిం చారు.