rural employment scheme
-
2022–23లో 30 కోట్ల పనిదినాల ఉపాధి
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉపాధిహామీ పథకం ద్వారా 30 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు గ్రామాల వారీగా పనులు కావాలని కోరుకుంటున్న వారిని గుర్తించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రతిపాదిత లేబర్ బడ్జెట్ రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా ఒక్కో జిల్లాలో మూడుకోట్లకుపైగా పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో పనిదినానికి 60:40 నిష్పత్తిన కూలీకి ప్రస్తుత రేట్ల ప్రకారం గరిష్టంగా రూ.245 వేతన రూపంలో చెల్లించడంతోపాటు మెటీరియల్ విభాగంలో మరో రూ.163 కేటాయిస్తారు. కూలీలు వారు కోరుకున్నప్పుడు వారి సొంత గ్రామంలోనే పనులను కల్పించేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో కొత్త పనులు గుర్తించే ప్రక్రియ క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలా గుర్తించిన పనులకు మొదట గ్రామసభ, తరువాత పంచాయతీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత లేబర్ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తే.. ప్రసుత ఉపాధి పథకం కూలీరేట్ల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల కూలీలకు గరిష్టంగా రూ.7,350 కోట్లు వేతనాల రూపంలో లభించే అవకాశం ఉంది. కూలీలకు గిట్టుబాటయ్యే సరాసరి వేతనాల మొత్తం ఆధారంగా గరిష్టంగా మరో రూ.4,890 కోట్లు మెటీరియల్ కోటాలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. 56.98 లక్షల కుటుంబాలకు ప్రయోజనం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 97.73 కోట్ల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధిహామీ పథకం కూలీలుగా నమోదయ్యారు. వీరిలో 56.98 లక్షల కుటుంబాల వారు క్రియాశీలకంగా ఏటా పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 45.45 లక్షల కుటుంబాలకు 21.73 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. రూ.4,817 కోట్లను కూలీలకు వేతనాల రూపంలో చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల ఇప్పటి నుంచి మళ్లీ ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి 26 కోట్ల పనిదినాల పాటు పనుల కల్పన పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
ఉపాధిహామీలో అక్రమాలు
గుడిహత్నూర్(బోథ్): ఉపాధి హామీలో అక్రమాలను సామాజిక తనిఖీ బృందం ప్రజావేదికలో వెల్లడించింది. మండల కేంద్రంలోని శివ కల్యాణ మండపంలో ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్ అధ్యక్షత బుధవారం ప్రజావేదిక నిర్వహించి వివరాలు వెల్లడించారు. 2016–17లో మండలంలోని 11 పంచాయతీల్లో రూ.4కోట్ల 71 లక్షలతో చేపట్టిన పనులు చేపట్టగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపారు. పని చేయకుండానే మస్టర్లు వేసి నిధులు మళ్లించారని, కూలీలకు బదులు యంత్రాలను ఉపయోగించారని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా ఉపాధి సిబ్బంది సుమారు రూ.20 లక్షల మేర ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని ఎస్ఆర్పీ రవి తెలిపారు. డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్ మాట్లాడుతూ సామాజిక తనిఖీ బృందం అందజేసిన నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావేదిక రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కేశవ్ గిత్తే, ఉపాధి ఏపీడీలు శ్రీధర్ స్వామి, కృష్ణారావ్, హెచ్ఆర్ మేనేజరు రషీద్, ఎస్పీఎం దత్తు, సర్పంచులు జలంధర్, విజయ్, నిర్మల, బాలాజీ, వైస్ ఎంపీపీ నిషాంత్, ఎంపీడీవో పుష్పలత, ఏపీవో విజయ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీ.. ఉగాది ఖాళీ
కోవెలకుంట్ల: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాది ఉగాది పండుగకు దూరం కానున్నారు. 55 రోజులు నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో తెలుగు సంవత్సరాది పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 53 మండలాల్లో 1.08 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయని కారణంగా గత నెల 2వ తేదీ నుంచి కూలీల వేతనాలు నిలిచిపోయాయి. ఒక్కో కుటుంబానికి సంబంధించి రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనాలు అందాల్సి ఉంది. జిల్లాలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు రూ. 15 కోట్ల మేర వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంటిల్లిపాది పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉపాధి పనులను ప్రారంభించింది. పనులకు వెళితే నాలుగుడబ్బులొస్తాయన్న ఆశతో కూలీలు వేసవికాలం ప్రారంభం కావడంతో ఎండను సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్నారు. వేతనాల కోసం రెండు నెలలుగా నిరీక్షణ దాదాపు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో కూలలు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బులు రాకపోవడంతో ఇప్పటికే ఎక్కువ శాతం మంది ఉపాధి కూలీలు పనులు మానేసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కొందరు మిరప కోతలు, గడ్డివాముల పనులకు వెళ్తుండగా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని కూలీలు తప్పని పరిస్థితుల్లో ఉపాధి పనులు చేస్తున్నారు. కూలీల సంఖ్యను పెంచాలంటూ జిల్లా కలెక్టర్ ఇటీవల సిబ్బందిపై కొరడా ఝుళిపించి 26 మండలాల సిబ్బందికి వారం రోజుల పాటు వేతనాల్లో కోత విధించారు. అయితే మరో రెండు రోజుల్లో ఉగాది పండుగ ఉండగా కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉగాది ముఖ్యమైన పండుగ కావడంతో వేతనాలు లేక పండుగ ఎలా చేయాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని వేతనాలు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు. పండగెట్టా చేయాలి: నారాయణమ్మ, ఉపాధి కూలీ నాలుగు వారాల నుంచి కోవెలకుంట్ల సమీపంలో జుర్రేరు వాగులో ఫాంపాండ్ల నిర్మాణ పనులు చేస్తున్నాను. 14 రోజుల కొకసారి వేతనాలు అందజేయాల్సి ఉంది. ఈ ఏడాది నెల రోజులు పనిచేసినా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లేకుండా ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి. బొబ్బలేక్కేలా చేసినా పైసా ఇవ్వలేదు: ఉసేన్‌బీ, ఉపాధి కూలీ భూమి గట్టిగా ఉండటంతో ఫాంపాండ్లు తవ్వేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేస్తే తప్ప రూ. 194 కూలి పడటం కష్టంగా ఉంది. నెలన్నర రోజుల నుంచి అర చేతులు బొబ్బలెక్కేలా పనిచే స్తున్నా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఉగాది పండుగకు డబ్బులు వస్తాయనుకుంటే ఇంత వరకు ఇవ్వలేదు వేతనాలు అందజేసేందుకు చర్యలు: సాంబశివరావు, ఉపాధి పథక ఏపీడీ కూలీలకు వేతనాలు చల్లించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. బ్యాంకర్లతో మాట్లాడి ఒకటి, రెండు రోజుల్లో కూలీలకు వేతనాలు అందించేందుకు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.