ఉపాధి కూలీ.. ఉగాది ఖాళీ
ఉపాధి కూలీ.. ఉగాది ఖాళీ
Published Mon, Mar 27 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
కోవెలకుంట్ల: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాది ఉగాది పండుగకు దూరం కానున్నారు. 55 రోజులు నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో తెలుగు సంవత్సరాది పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 53 మండలాల్లో 1.08 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయని కారణంగా గత నెల 2వ తేదీ నుంచి కూలీల వేతనాలు నిలిచిపోయాయి.
ఒక్కో కుటుంబానికి సంబంధించి రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనాలు అందాల్సి ఉంది. జిల్లాలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు రూ. 15 కోట్ల మేర వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంటిల్లిపాది పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉపాధి పనులను ప్రారంభించింది. పనులకు వెళితే నాలుగుడబ్బులొస్తాయన్న ఆశతో కూలీలు వేసవికాలం ప్రారంభం కావడంతో ఎండను సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్నారు.
వేతనాల కోసం రెండు నెలలుగా నిరీక్షణ
దాదాపు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో కూలలు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బులు రాకపోవడంతో ఇప్పటికే ఎక్కువ శాతం మంది ఉపాధి కూలీలు పనులు మానేసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కొందరు మిరప కోతలు, గడ్డివాముల పనులకు వెళ్తుండగా గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని కూలీలు తప్పని పరిస్థితుల్లో ఉపాధి పనులు చేస్తున్నారు. కూలీల సంఖ్యను పెంచాలంటూ జిల్లా కలెక్టర్ ఇటీవల సిబ్బందిపై కొరడా ఝుళిపించి 26 మండలాల సిబ్బందికి వారం రోజుల పాటు వేతనాల్లో కోత విధించారు. అయితే మరో రెండు రోజుల్లో ఉగాది పండుగ ఉండగా కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉగాది ముఖ్యమైన పండుగ కావడంతో వేతనాలు లేక పండుగ ఎలా చేయాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని వేతనాలు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.
పండగెట్టా చేయాలి: నారాయణమ్మ, ఉపాధి కూలీ
నాలుగు వారాల నుంచి కోవెలకుంట్ల సమీపంలో జుర్రేరు వాగులో ఫాంపాండ్ల నిర్మాణ పనులు చేస్తున్నాను. 14 రోజుల కొకసారి వేతనాలు అందజేయాల్సి ఉంది. ఈ ఏడాది నెల రోజులు పనిచేసినా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లేకుండా ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి.
బొబ్బలేక్కేలా చేసినా పైసా ఇవ్వలేదు: ఉసేన్‌బీ, ఉపాధి కూలీ
భూమి గట్టిగా ఉండటంతో ఫాంపాండ్లు తవ్వేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేస్తే తప్ప రూ. 194 కూలి పడటం కష్టంగా ఉంది. నెలన్నర రోజుల నుంచి అర చేతులు బొబ్బలెక్కేలా పనిచే స్తున్నా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఉగాది పండుగకు డబ్బులు వస్తాయనుకుంటే ఇంత వరకు ఇవ్వలేదు
వేతనాలు అందజేసేందుకు చర్యలు: సాంబశివరావు, ఉపాధి పథక ఏపీడీ
కూలీలకు వేతనాలు చల్లించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. బ్యాంకర్లతో మాట్లాడి ఒకటి, రెండు రోజుల్లో కూలీలకు వేతనాలు అందించేందుకు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement