ఉపాధిహామీలో అక్రమాలు
గుడిహత్నూర్(బోథ్): ఉపాధి హామీలో అక్రమాలను సామాజిక తనిఖీ బృందం ప్రజావేదికలో వెల్లడించింది. మండల కేంద్రంలోని శివ కల్యాణ మండపంలో ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్ అధ్యక్షత బుధవారం ప్రజావేదిక నిర్వహించి వివరాలు వెల్లడించారు. 2016–17లో మండలంలోని 11 పంచాయతీల్లో రూ.4కోట్ల 71 లక్షలతో చేపట్టిన పనులు చేపట్టగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపారు. పని చేయకుండానే మస్టర్లు వేసి నిధులు మళ్లించారని, కూలీలకు బదులు యంత్రాలను ఉపయోగించారని స్పష్టం చేశారు.
మండల వ్యాప్తంగా ఉపాధి సిబ్బంది సుమారు రూ.20 లక్షల మేర ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని ఎస్‌ఆర్పీ రవి తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్ మాట్లాడుతూ సామాజిక తనిఖీ బృందం అందజేసిన నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజావేదిక రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కేశవ్ గిత్తే, ఉపాధి ఏపీడీలు శ్రీధర్ స్వామి, కృష్ణారావ్, హెచ్‌ఆర్ మేనేజరు రషీద్, ఎస్పీఎం దత్తు, సర్పంచులు జలంధర్, విజయ్, నిర్మల, బాలాజీ, వైస్ ఎంపీపీ నిషాంత్, ఎంపీడీవో పుష్పలత, ఏపీవో విజయ తదితరులు పాల్గొన్నారు.