ఆదిలాబాద్ : జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయి. ఆ శాఖ ఉద్యోగులు తమకు అనుకూలమైన వారిని, రక్తసంబంధీకులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల మూలాలు గమనిస్తే ఆ శాఖ ఉద్యోగుల సంబంధీకులు, పరిచయస్తులు కావడం గమనార్హం.
ఈ నియామకాలు హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీ చేపడుతోందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ ఏజెన్సీతో ఉద్యోగులకు సంబంధాలు ఉన్నయా? లేనిపక్షంలో ఉన్నతాధికారుల అండదండలతో ఈ వ్యవహారం జరుగుతుందా? అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి కుమారుడు అదే కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్నాడు. అదే కార్యాలయంలోని మరో ఉద్యోగి కూతురు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తుంది.
ఆదిలాబాద్‌లో పనిచేసే ఓ ఉద్యోగి దగ్గరి బంధువు ఆదిలాబాద్ కార్యాలయంలోనే పని చేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్, ఖానాపూర్ కార్యాలయాల్లో పనిచేస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైనా ఇద్దరు ఉన్నతాధికారుల పరిచయస్తులు నిర్మల్, ఖానాపూర్ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి కూతురు లక్సెట్టిపేటలో, జిల్లాలో పనిచేసి ప్రసుత్తం కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోదరుడు మంచిర్యాలలో పనిచేస్తున్నాడు. వీరందరిని చూస్తుంటే వారికి దగ్గరి వారే తప్పిస్తే ఇతరులేవరు కనిపించకపోవడం గమనార్హం.
తలా పాపం.. తిలా పిడికెడు..
అవినీతిలో పలువురి భాగస్వామ్యం ఉన్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలకపాత్ర వహిస్తున్నారు. అవినీతి బయటపడితే వారిని తొలగించ డం తప్పితే శాఖ పరంగా ఏమీ చేయలేని పరిస్థితి. అదే రెగ్యూలర్ ఉద్యోగులైతే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పరోక్షంగా రెగ్యూలర్ ఉద్యోగులే వారిని ప్రోత్సహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.60 లక్షల నకిలీ చలాన్ల కుంభకోణమే ఇందుకు ఉదాహరణ.
ఈ వ్యవహారంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిదే కీలక పాత్ర కావటం విశేషం. ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తన దగ్గర బంధువైన రిజిస్ట్రేషన్ బ్రోకర్‌తో కలిసి నకిలీ చలాన్ల వ్యవహారాన్ని నడిపారు. కేవలం ఏడాది జరిగిన అక్రమాల పరిశీలనలోనే అంతా పెద్ద మొత్తం బయటపడింది. 2011 నుంచి ఇక్కడ నకిలీ చలాన్ల బాగోతం జరుగుతుందని ప్రచారంలో ఉండగా పరిశీలన అప్పటి నుంచి చేపట్టి ఉంటే ఈ వ్యవహారం కోట్ల రూపాయలు దాటిపోయేది. ఉన్నతాధికారులు గతం జోలికి వెళ్లకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? అని చర్చించుకుంటున్నారు. మంచిర్యాలలోనూ కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది.
నియామకాలేవి?
రిజిస్ట్రేషన్ శాఖలో జిల్లా రిజిస్ట్రార్ నుంచి అటెండర్ కేడర్ వరకు అన్ని స్థాయిల్లో కలిపి 67 పోస్టులు ఉన్నాయి. ఇందులో 45 మంది పనిచేస్తుండగా 21 పోస్టులు ఏన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనంగా భారం పడుతోంది. జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉండగా కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ పోస్టులు 12 ఉండగా ఆరు ఖాళీగా ఉన్నాయి. సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, అటెండర్ పోస్టులు కూడా పెద్ద మొత్తంలో ఖాళీ ఉన్నాయి.
రెగ్యూలర్ నియామకాలు జరగకపోవటంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని వ్యవహారం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 మంది ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌పై కేడర్‌ను బట్టి ఇక్కడ పంపకాలు జరుగుతాయనే జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ సంబంధీకులను, దగ్గరి వారిని నియమించుకొని తమ వ్యవహారాలను యధేచ్ఛగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
మనోడేనా.. అయితే ఓకే..!
Published Wed, Aug 20 2014 2:31 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement