registration offices
-
మధ్యవర్తులదే హవా.. నెల రోజుల్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్..
సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనల్లోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు పడింది. లక్సెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి సబ్‌రిజిస్ట్రార్ ఇక్బాల్ సెలవుల్లో ఉండగా ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా రతన్ విధుల్లో చేరారు. ఈయన గత నెల 11న రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. ఒకే రోజు 39 రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. రియల్టర్లకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేశారని స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆఫీసు ముందు నిరసనలు వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. జూన్ 15న మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ అప్పారావు సైతం సస్పెండ్ అయ్యారు. ఈయన క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో అమర్వాది శివారులోని సర్వే నంబర్ 3లో 847గజాల ప్లాట్‌లో లే అవుట్ లేకుండానే మూడు ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్లు చేశారనే ఫిర్యాదుతో సస్పెండ్ అయ్యారు. ‘పాత పద్ధతి’తో సాగని రియల్ వ్యాపారం జిల్లాలో బొగ్గు గనులు, అనుబంధ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు పుష్కలమైన అవకాశాలు ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాలు, జాతీయ రహదారులకు అనుకుని ఉన్న గ్రామాలు శర వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం జిల్లా ఆవిర్భావం కంటే ముందు నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతోంది. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక అక్రమాలకు తెరలేపారు. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తమ ఆధిపత్యం నడిపించారు. జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వ, లావుణి, నాలా అనుమతి లేకుండానే అడ్డగోలుగా అక్రమంగా వెంచర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించారు. మున్సిపల్, రెవెన్యూ, నాలా, డీటీసీపీ అనుమతులు పొందకుండానే పెద్ద ఎత్తున ప్లాట్లు చేతులు మారాయి. మంచిర్యాలతోపాటు గద్దెరాగడి, తిమ్మాపూర్, మందమర్రి, నస్పూర్, హాజీపూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, జైపూర్‌తోపాటు అనేక ప్రాంతాల్లో లే అవుట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు సాగాయి. ప్రభుత్వం గత అక్టోబర్ నుంచి వ్యవసాయ భూములకు ధరణి పోర్టల్‌లో ఎమ్మార్వో కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయేతర భూములకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ పథకంపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్ఆర్ఎస్కు బ్రేక్ పడింది. దీంతో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనతో సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ప్లాట్ కొనలేక, అమ్మలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం డాక్యుమెంట్టు డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. అంటే కొత్త ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసిన ప్లాట్లకు మాత్రమే చేయాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో అన్ని అనుమతులు, లే అవుట్ అనుమతి ఉన్న వాటికే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రియల్ లావాదేవీలకు దెబ్బ పడింది. గతంలోనే జిల్లాలో లే అవుట్ లేని ప్లాట్లు అనేకంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర జిల్లాల్లో పాత పద్ధతిలోనే చేస్తున్నారని ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఇక్కడి రియల్‌వ్యాపారులు పలుమార్లు కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ కేవలం పాత డాక్యుమెంట్లకే రిజిస్ట్రేషన్లు చేశారు. లక్సెట్టిపేటలో రియల్ వ్యాపారులకు తలొగ్గి రాత్రికి రాత్రే అధిక రిజిస్ట్రేషన్లు చేయడం, మంచిర్యాల పరిధిలో తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేయడం లేదనే కారణంతో ఓ పథకం ప్రకారం సస్పెండ్ చేయించినట్లు అనుమానాలు ఉన్నాయి. అక్కడంతా వారిదే రాజ్యం.. జిల్లాలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులు, రియల్ దళారులు, అనధికార వ్యక్తుల హవానే నడుస్తోంది. భూమి, స్థిర ఆస్తి, సంస్థలు, వివాహ, సొసైటీలు తదితర రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్ సేవలు అందుబాటులో వచ్చినప్పటికీ మధ్యవర్తుల హవా తగ్గడం లేదు. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక రేటు ఫిక్స్ చేసి వసూళ్లు సాగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు ఇదంతా తెలిసినా నోరు మెదపరు. ప్రస్తుతం లే అవుట్ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో చాలావరకు రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కరోనాకు ముందు, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు మంచిర్యాలలో రోజుకు 80వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 50నుంచి 60వరకు జరుగుతున్నాయి. లక్సెట్టిపేట పరిధిలో రోజుకు రెండు మాత్రమే అవుతున్నాయి. దీంతో చాలామంది ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి. చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్ లీక్ -
తెరుచుకోనున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకోనున్నాయి. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ... కార్యాలయాల్లో విధుల్లో పాల్గొనాలని సూచనలు ఇచ్చింది. అలాగే రిజిస్ట్రేషన్‌కి వచ్చే వారికి సీరియల్ ప్రకారం భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (సచివాలయంలో పెరిగిన ఉద్యోగుల హాజరు) కాగా లాక్డౌన్ నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిప్రకారం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే అమరావతిలో సచివాలయ ఉద్యోగులు ఇవాళ విధులకు హాజరయ్యారు. మూడో వంతు సిబ్బందితో సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ పని చేయనున్నాయి. (లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక ప్రకటన) -
రిజిస్ట్రేషన్ ప్రైవేటు.. లేఖరులకు చేటు
రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణకు యత్నం ఉపాధి కల్పించకపోగా ఉన్నదానికీ ఎసరు రోడ్డున పడుతున్న వేలాది లేఖరులు వారంతా సిరా కార్మికులు.. కలం వారి పెట్టుబడి..దస్తావేజు రాతతో వచ్చే పదో పాతికతో బతుకు దెరువు సాగిస్తున్న బడుగు జీవులు. బ్రిటీష్ కాలం నుంచి ఇదే వృత్తిగా జీవనం సాగిస్తూ... స్థిరాసులకు రక్షణ కల్పిస్తూ.. రెవెన్యూవ్యవస్థకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో కీలకంగా వ్యవహరించే అలాంటి వారిపై ప్రస్తుత ప్రభుత్వం వేటు వేయాలని చూస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణకు సమాయత్తమవుతోంది. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని లేఖరులు ఆందోళన చెందుతున్నారు. తప్పులకు బాధ్యత... లేఖరి తను రాసిన దస్తావేజుకు పూర్తి బాధ్యత వహిస్తాడు. దస్తావేజును తయారు చేసిన తర్వాత ఇరుపార్టీలకు పూర్తిగా చదివి వినిపించి, ఇరు పార్టీల సంతకాలు వగైరాలు చేయించి సాక్షులతో సంతకాలు చేయించి చివరగా దస్తావేజు తయారు చేసినట్టు కాగితం మీద స్రైబ్ చేస్తాడు. దానివలన భవిష్యత్తులో సదరు రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి ఏవైనా చిక్కు లు, కోర్టు తగాదాలు వస్తే మొదట సాక్ష్యం చెప్పే బాధ్యత లేఖరి దే. ఇలాంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల స్థిరాస్తులకు రక్షణ కరువు అవుతుంది. పుంగనూరుటౌన్: జిల్లాలో బాలాజీ, చిత్తూరు అనే రెండు రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 25 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 3 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అలాగే కొన్ని వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులును క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తామని టీడీపీ ఎన్నికల హామీలో పేర్కొంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణకు సమాయత్తమవుతోంది. కేవలం రిజిస్ట్రార్, ఆయనకు సహాయకుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదే జరిగితే రిజిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడి స్థిరాస్తులకు రక్షణ కరువు అవుతోంది. లేఖరుల వ్యవస్థ కీలకం లేఖరి దస్తావేజును త యారు చేసే ముందు ఆస్తికి సంబంధించిన హక్కుదారుడు ఎవ రు?, వారసులు ఎవ రు? అని విచారించి సర్వే నంబరు మొదలుకుని హద్దులు, విస్తీర్ణం, కొలతలు, సరిహద్దు హక్కు లు, దారి హక్కులు, నీటికాలువ హక్కులు, సంసృష్టం హక్కులు అన్నీ పూర్తిగా సవిరంగా దస్తావేజులో పొందుపరిచి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారు. దీనికితోడు దస్తావేజు లేఖరులు స్థానికులు కావడం తో వారికి స్థానిక భూములపై అవగాహన ఉం టుంది. ప్రైవేటీకరణ జరిగితే వారు నియమిం చే వ్యక్తులు ఈ సమాచారాన్ని సేకరించే అవకాశముండదు. భూవ్యవస్థ నాశనమవుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలి 29 ఏళ్లుగా దస్తావేజులేఖరిగా కొనసాగుతున్నాను. బీఏ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి పోరాడి చివరకు ఓపిక నశించి తెలిసిన వారి సూచన మేరకు ఈ వృత్తిలోకి వచ్చాను. దేవుడి దయ వల్ల కుటుంబపోషణకు, బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పుణ్యమా అని మాలాంటి వాళ్లు రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వేలాది మంది జీవితాలకు రక్షణ కల్పించాలి. - కె.రామమూర్తి, దస్తావేజు లేఖరుల జోనల్ కమిటీ అధ్యక్షులు. పుంగనూరు. -
రిజిస్ట్రేషన్ శాఖకు లక్ష్మీ కటాక్షం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ సర్వర్ల మొరాయింపు సమస్య ఉన్నప్పటికీ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో మరీ ఎక్కువగా ఉంది. తరచూ విద్యుత్ సరఫరాలో ఆటంకాలతో పాటు యూపీఎస్లూ డౌన్ అవుతున్నాయి. అధికారులు మేల్కొని సెంట్రల్ సర్వర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇక్కడి సర్వర్లు మళ్లీ అప్ అవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. శనివారం నుంచి భూముల విలువ పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మరుసటి రోజు ఆది వారం కావడంతో సోమవారం నుంచి లావాదేవీలు మరింత జోరందుకునే అవకాశం ఉందని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. 30 నుంచి 40 శాతం అధికం: శ్రీకాకుళంలోని కేంద్ర రిజిస్ట్రేషన్ కార్యాలయంతోపాటు జిల్లాలో మరో 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఓ డీఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఏటా భూముల మార్కెట్ ధరను 30 నుంచి 40 శాతం వరకు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక్కో జిల్లాకు ఒక్కోలా, అర్బన్/రూరల్‌కు వేర్వేరుగా ఉంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో 5,636 లావాదేవీలు జరగ్గా రూ.7.7 కోట్ల ఆదాయం వచ్చింది. లక్ష్యం రూ.5.36 కోట్లే కాగా సుమారు 140 శాతం పైనే లక్ష్యం సాధించామని రెండు జిల్లాల అధికారి సరోజ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే జూలై మూడో వారం వరకు సుమారు 3,331 లావాదేవీలు జరగ్గా సుమారు రూ.5.04 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి మూడు నెలలకూ లక్ష్యం వేర్వేరుగా ఉంటుంది. ఆవిధంగా జూలైలో రూ.7.37 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. మరో వారం రోజుల లావాదేవీలు కలిపితే లక్ష్యాన్ని మించి వృద్ధి సాధించినట్టు అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. గత నెల 25వ తేదీ నుంచి 30 వరకు మొత్తం 290 వరకు లావాదేవీలు జరిగినట్టు అంచనా. శనివారం నుంచి భూముల విలువ పెరుగుతుండడంతో ఆగస్టు నెలలో కూడా లక్ష్యాన్ని దాటి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఏటా సుమారు రూ.67 కోట్ల ఆదాయ లక్ష్యంతో పనిచేస్తుంటే మూడు నెలల్లోనే (త్రైమాసిక) రూ.14 కోట్ల మేర ఆదాయం సాధించామని డీఐజీ స్పష్టం చేశారు. గతేడాది హుద్‌హుద్ తుపాను సమయంలో కాస్త వెనక్కు వెళ్లిపోయినా అనంతర పరిణామాలతో ఒక నెల కంటే మరో నెల గరిష్టంగా ఆదాయం సంపాదించగలిగామన్నారు. ఏసీబీ హడల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారుల (ఏసీబీ)కు ఫిర్యాదిచ్చారు. దీంతో కొన్నాళ్లగా ఏసీబీ అధికారులు జిల్లా కేంద్ర రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిఘా పెంచారు. ఇటీవల అక్కడి అధికారుల వద్ద స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించినట్టు తెలిసింది. గత నెల 31వ తేదీ శుక్రవారం కూడా సోదాలు జరిపి కొన్ని విలువైన పత్రాలు, అక్కడి దస్తావేజులేఖకుల నుంచి కొన్ని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఫిర్యాదు మేరకు రెండు జిల్లాల అధికారిణి నుంచి కూడా వివరాలు సేకరించారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోదాలు నిజమేనని ఏసీబీ అధికారి ఒకరు ధ్రువీకరించారు. -
ఉదయం 8 గంటలకే రిజిస్టార్ కార్యాలయాలు
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పెరుగుతున్న దస్తావేజుల నమోదు తాకిడిని అధిగమించేందుకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సిద్దమవుతోంది. ఉద్యోగులు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వారికి వెసులుబాటుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పనివేళలు ఉండే విధంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ రిజిస్ట్రేషన్ పరిధిలోని బోయిన్పల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేసి పెలైట్ ప్రాజెక్టుల ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో రోజుకు రెండేసి షిఫ్టులుగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు సేవలందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అమలులో ఉన్న కారణంగా ఒక రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో రెండు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కడైన రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేందుకు దస్తావేజు దారులకు వెసులు బాటు ఉంటుంది. -
మనోడేనా.. అయితే ఓకే..!
ఆదిలాబాద్ : జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయి. ఆ శాఖ ఉద్యోగులు తమకు అనుకూలమైన వారిని, రక్తసంబంధీకులను ఔట్సోర్సింగ్ పద్ధతిపై నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల మూలాలు గమనిస్తే ఆ శాఖ ఉద్యోగుల సంబంధీకులు, పరిచయస్తులు కావడం గమనార్హం. ఈ నియామకాలు హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీ చేపడుతోందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ ఏజెన్సీతో ఉద్యోగులకు సంబంధాలు ఉన్నయా? లేనిపక్షంలో ఉన్నతాధికారుల అండదండలతో ఈ వ్యవహారం జరుగుతుందా? అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి కుమారుడు అదే కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్నాడు. అదే కార్యాలయంలోని మరో ఉద్యోగి కూతురు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తుంది. ఆదిలాబాద్‌లో పనిచేసే ఓ ఉద్యోగి దగ్గరి బంధువు ఆదిలాబాద్ కార్యాలయంలోనే పని చేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్, ఖానాపూర్ కార్యాలయాల్లో పనిచేస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైనా ఇద్దరు ఉన్నతాధికారుల పరిచయస్తులు నిర్మల్, ఖానాపూర్ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి కూతురు లక్సెట్టిపేటలో, జిల్లాలో పనిచేసి ప్రసుత్తం కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోదరుడు మంచిర్యాలలో పనిచేస్తున్నాడు. వీరందరిని చూస్తుంటే వారికి దగ్గరి వారే తప్పిస్తే ఇతరులేవరు కనిపించకపోవడం గమనార్హం. తలా పాపం.. తిలా పిడికెడు.. అవినీతిలో పలువురి భాగస్వామ్యం ఉన్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలకపాత్ర వహిస్తున్నారు. అవినీతి బయటపడితే వారిని తొలగించ డం తప్పితే శాఖ పరంగా ఏమీ చేయలేని పరిస్థితి. అదే రెగ్యూలర్ ఉద్యోగులైతే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పరోక్షంగా రెగ్యూలర్ ఉద్యోగులే వారిని ప్రోత్సహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.60 లక్షల నకిలీ చలాన్ల కుంభకోణమే ఇందుకు ఉదాహరణ. ఈ వ్యవహారంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిదే కీలక పాత్ర కావటం విశేషం. ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగి తన దగ్గర బంధువైన రిజిస్ట్రేషన్ బ్రోకర్‌తో కలిసి నకిలీ చలాన్ల వ్యవహారాన్ని నడిపారు. కేవలం ఏడాది జరిగిన అక్రమాల పరిశీలనలోనే అంతా పెద్ద మొత్తం బయటపడింది. 2011 నుంచి ఇక్కడ నకిలీ చలాన్ల బాగోతం జరుగుతుందని ప్రచారంలో ఉండగా పరిశీలన అప్పటి నుంచి చేపట్టి ఉంటే ఈ వ్యవహారం కోట్ల రూపాయలు దాటిపోయేది. ఉన్నతాధికారులు గతం జోలికి వెళ్లకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? అని చర్చించుకుంటున్నారు. మంచిర్యాలలోనూ కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. నియామకాలేవి? రిజిస్ట్రేషన్ శాఖలో జిల్లా రిజిస్ట్రార్ నుంచి అటెండర్ కేడర్ వరకు అన్ని స్థాయిల్లో కలిపి 67 పోస్టులు ఉన్నాయి. ఇందులో 45 మంది పనిచేస్తుండగా 21 పోస్టులు ఏన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనంగా భారం పడుతోంది. జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉండగా కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ పోస్టులు 12 ఉండగా ఆరు ఖాళీగా ఉన్నాయి. సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, అటెండర్ పోస్టులు కూడా పెద్ద మొత్తంలో ఖాళీ ఉన్నాయి. రెగ్యూలర్ నియామకాలు జరగకపోవటంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని వ్యవహారం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌పై కేడర్‌ను బట్టి ఇక్కడ పంపకాలు జరుగుతాయనే జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ సంబంధీకులను, దగ్గరి వారిని నియమించుకొని తమ వ్యవహారాలను యధేచ్ఛగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈసీ
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆస్తుల క్రయ, విక్రయాల సమయంలో కీలక పాత్ర పోషించే యంకంబ్రాన్స్ సర్టిఫికేట్ (ఈసీ) ఇతర డాక్యుమెంట్లను కేవలం మీ సేవా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలా చేయడమంటే అవినీతిని ఆహ్వానించడమేనంది. వాటన్నిటినీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జారీ చేయాలని, ఆ మేర సబ్ రిజిస్ట్రార్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ కూడా పంపిణీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీని ఆదేశించింది. ఈసీలు, ఇతర డాక్యుమెంట్లను మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా, కంకిపాడుకు చెందిన జొన్నకూటి రాధాకృష్ణమూర్తి, కొత్తపల్లి సీతారామ ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. వాటిని మీ సేవా కేంద్రాల్లోనే ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వీర్జాల ప్రవీణ్‌కుమార్ కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని అధికారుల విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని రెవిన్యూ అధికారులను ఆదేశించింది. దీనిపై వారు స్పందించకపోగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువునివ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఈసీ, ఇతర డాక్యుమెంట్ల కోసం నిర్దేశిత ఫీజు చెల్లించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఆశ్రయించవచ్చు. మీసేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్లందరూ కూడా ఆ డాక్యుమెంట్లను జారీ చేయాలి. కేవలం మీ సేవా కేంద్రాలే అంటే.. అది ఒక రకమైన హింస కూడా. అది అవినీతిని ఆహ్వానించడమే అవుతుంది. అందుకే ప్రజల సమస్యను తొలగించేందుకు ఈ ఆదేశమిస్తున్నాం’’ అని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం: హైకోర్టు ఉత్తర్వులను శనివారం విజయవాడలో దస్తావేజులేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ పత్రికలకు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే, న్యాయపోరాటం చేస్తామని ఆయన స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులను హెచ్చరించారు. -
మీ సేవలు వద్దు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మీ-సేవ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ విధానాన్ని అప్పగించే యోచనను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరులు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు బైఠాయించి ఆందోళనలు జరిపారు. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. కోట్ల రూపాయల ఆస్తి లావాదేవీలకు ఆటంకం కలిగి కక్షిదారులు ఇక్కట్లపాలయ్యారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, కంకిపాడు, నూజివీడుతోపాటు అన్ని సెంటర్లలో డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను బంద్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మూయించారు. గేట్లకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేశారు. విజయవాడ నగరంలో గాంధీనగ ర్, పటమట, గుణదల, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దస్తావేజు లేఖరుల సమ్మెకు మద్దతు తెలిపారు. పటమట కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మల హరికృష్ణ, సంఘం నాయకుడు నారాయణరావు తదితరులు ఆందోళన జరిపారు.