సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈసీ
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆస్తుల క్రయ, విక్రయాల సమయంలో కీలక పాత్ర పోషించే యంకంబ్రాన్స్ సర్టిఫికేట్ (ఈసీ) ఇతర డాక్యుమెంట్లను కేవలం మీ సేవా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలా చేయడమంటే అవినీతిని ఆహ్వానించడమేనంది. వాటన్నిటినీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జారీ చేయాలని, ఆ మేర సబ్ రిజిస్ట్రార్‌లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ కూడా పంపిణీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీని ఆదేశించింది. ఈసీలు, ఇతర డాక్యుమెంట్లను మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా, కంకిపాడుకు చెందిన జొన్నకూటి రాధాకృష్ణమూర్తి, కొత్తపల్లి సీతారామ ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. వాటిని మీ సేవా కేంద్రాల్లోనే ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వీర్జాల ప్రవీణ్‌కుమార్ కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని అధికారుల విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని రెవిన్యూ అధికారులను ఆదేశించింది. దీనిపై వారు స్పందించకపోగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువునివ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది.
‘‘ఈసీ, ఇతర డాక్యుమెంట్ల కోసం నిర్దేశిత ఫీజు చెల్లించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఆశ్రయించవచ్చు. మీసేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్లందరూ కూడా ఆ డాక్యుమెంట్లను జారీ చేయాలి. కేవలం మీ సేవా కేంద్రాలే అంటే.. అది ఒక రకమైన హింస కూడా. అది అవినీతిని ఆహ్వానించడమే అవుతుంది. అందుకే ప్రజల సమస్యను తొలగించేందుకు ఈ ఆదేశమిస్తున్నాం’’ అని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం: హైకోర్టు ఉత్తర్వులను శనివారం విజయవాడలో దస్తావేజులేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ పత్రికలకు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే, న్యాయపోరాటం చేస్తామని ఆయన స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులను హెచ్చరించారు.