సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ సర్వర్ల మొరాయింపు సమస్య ఉన్నప్పటికీ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో మరీ ఎక్కువగా ఉంది. తరచూ విద్యుత్ సరఫరాలో ఆటంకాలతో పాటు యూపీఎస్‌లూ డౌన్ అవుతున్నాయి. అధికారులు మేల్కొని సెంట్రల్ సర్వర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇక్కడి సర్వర్లు మళ్లీ అప్ అవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. శనివారం నుంచి భూముల విలువ పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మరుసటి రోజు ఆది వారం కావడంతో సోమవారం నుంచి లావాదేవీలు మరింత జోరందుకునే అవకాశం
ఉందని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
30 నుంచి 40 శాతం అధికం: శ్రీకాకుళంలోని కేంద్ర రిజిస్ట్రేషన్ కార్యాలయంతోపాటు జిల్లాలో మరో 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఓ డీఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఏటా భూముల మార్కెట్ ధరను 30 నుంచి 40 శాతం వరకు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక్కో జిల్లాకు ఒక్కోలా, అర్బన్/రూరల్‌కు వేర్వేరుగా ఉంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో 5,636 లావాదేవీలు జరగ్గా రూ.7.7 కోట్ల ఆదాయం వచ్చింది. లక్ష్యం రూ.5.36 కోట్లే కాగా సుమారు 140 శాతం పైనే లక్ష్యం సాధించామని రెండు జిల్లాల అధికారి సరోజ ‘సాక్షి’కి చెప్పారు.
అలాగే జూలై మూడో వారం వరకు సుమారు 3,331 లావాదేవీలు జరగ్గా సుమారు రూ.5.04 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి మూడు నెలలకూ లక్ష్యం వేర్వేరుగా ఉంటుంది. ఆవిధంగా జూలైలో రూ.7.37 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. మరో వారం రోజుల లావాదేవీలు కలిపితే లక్ష్యాన్ని మించి వృద్ధి సాధించినట్టు అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. గత నెల 25వ తేదీ నుంచి 30 వరకు మొత్తం 290 వరకు లావాదేవీలు జరిగినట్టు అంచనా. శనివారం నుంచి భూముల విలువ పెరుగుతుండడంతో ఆగస్టు నెలలో కూడా లక్ష్యాన్ని దాటి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఏటా సుమారు రూ.67 కోట్ల ఆదాయ లక్ష్యంతో పనిచేస్తుంటే మూడు నెలల్లోనే (త్రైమాసిక) రూ.14 కోట్ల మేర ఆదాయం సాధించామని డీఐజీ స్పష్టం చేశారు. గతేడాది హుద్‌హుద్ తుపాను సమయంలో కాస్త వెనక్కు వెళ్లిపోయినా అనంతర పరిణామాలతో ఒక నెల కంటే మరో నెల గరిష్టంగా ఆదాయం సంపాదించగలిగామన్నారు.
ఏసీబీ హడల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారుల (ఏసీబీ)కు ఫిర్యాదిచ్చారు. దీంతో కొన్నాళ్లగా ఏసీబీ అధికారులు జిల్లా కేంద్ర రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిఘా పెంచారు. ఇటీవల అక్కడి అధికారుల వద్ద స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేయించినట్టు తెలిసింది. గత నెల 31వ తేదీ శుక్రవారం కూడా సోదాలు జరిపి కొన్ని విలువైన పత్రాలు, అక్కడి దస్తావేజులేఖకుల నుంచి కొన్ని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఫిర్యాదు మేరకు రెండు జిల్లాల అధికారిణి నుంచి కూడా వివరాలు సేకరించారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోదాలు నిజమేనని ఏసీబీ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
రిజిస్ట్రేషన్ శాఖకు లక్ష్మీ కటాక్షం!
Published Mon, Aug 3 2015 1:42 AM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM
Advertisement
Advertisement