Rural farmers family
-
ఆదాయం ఏం మారలేదబ్బా..!
సాక్షి, అమరావతి: దేశంలో గత ఏడాది 41.5 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయంలో ఎటువంటి మార్పులేదు. 36.0 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది. 22.6 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల సెంటిమెంట్స్ సర్వేలో ఈ విషయాలు గుర్తించినట్లు నాబార్డు వెల్లడించింది.వివిధ రాష్ట్రాల్లో గ్రామాల్లోని కుటుంబాల ఆదాయం, వినియోగం, ఆర్థిక పొదుపు, రుణాలు, మూలధన పెట్టుబడులకు సంబంధించి సర్వే చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అంచనా వేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగ డిమాండ్ ఉత్సాహంగా ఉందని సర్వే తెలిపింది. పొదుపు చేయడంలో గ్రామీణ కుటుంబాల్లో ఎటువంటి మార్పులేదని, మూలధన పెట్టుబడి పెట్టిన కుటుంబాల శాతం పెరిగిందని సర్వేలో తేలింది. -
మిస్ ఇండియా పోటీలకు గ్రామీణ రైతుబిడ్డ గోమతిరెడ్డి
ఓబులవారిపల్లె: గ్రామీణ రైతుబిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణకుమారి దంపతుల ఏకైక కుమార్తె ముక్కా గోమతిరెడ్డి మార్చి 5వ తేదీన ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గోమతిరెడ్డి చిన్ననాటి నుంచి పాఠశాలల్లో బెస్ట్ బేబి తదితర పోటీల్లో రాణిస్తూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేందుకు అన్ని విధాల సహకారం అందించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీల్లో గెలుపొందింది. అనంతరం బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అక్కడితో అగిపోకుండా మోడలింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి, 25వ తేదీన ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మిస్ ఇండియా పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్న గోమతిరెడ్డి... మిస్ వరల్డ్ సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా సాధించవచ్చనే లక్ష్యంతో ముందుకువెళుతున్నానని, తన గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పింది. -
మాతృభూమి అభివృద్ధికి ఆనందరావు కృషి
మందస: ఓ సామాన్య గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టిన కంచరాన ఆనందరావు అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదిగారని, ఆయన ఎక్కడ పని చేసినా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. మందస మండలంలోని కుంటికోటకు చెందిన పశు పరిశోధన శాస్త్రవేత్త ఆనందరావు నేషనల్ ఫెలోషిప్ పురస్కారానికి ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కుంటికోట వచ్చిన ఆయనకు సోమవారం స్థానికులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుంపల లింగరాజు, శ్రీకాకుళం జిల్లా జూనియర్ అధ్యాపకులు సంఘం ఉపాధ్యక్షుడు చింతాడ శరత్‌బాబు, యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి గుంట కోదండరావు మాట్లాడుతూ.. పశు వైద్యాధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆనందరావు అదే శాఖలో శాస్త్రవేత్తగా ఎదిగి కుంటికోట గ్రామానికి మంచిపేరు తీసుకువచ్చారన్నారు. సొంత నిధులతో గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేస్తున్నారని, యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని తెలిపారు. 2001వ సంవత్సరంలో జిల్లాలోనే ఉత్తమ పశువైద్యాధికారిగా అప్పటి కలెక్టర్ జవహర్‌రెడ్డి నుంచి అవార్డు అందుకున్నారని చెప్పారు. అనంతరం 2012లో ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారన్నారు. 2015లో మిజోరాంలోని ఐజ్వాల్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పశు యాజమాన్య సదస్సులో ఉత్తమ పరిశోధనా పురస్కారం, 2016వ సంవత్సరంలో పశు వైద్యంలో నాటు మందుల పాత్రపై అంతర్జాతీయ స్థాయి డాక్టర్ బీదర్కర్ పురస్కారం లభించిందన్నారు. సన్మాన గ్రహీత ఆనందరావు మాట్లాడుతూ.. పశువుల కోసం టీకాలు కనిపెడతానని, జీవితాంతం గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు కొర్ల హేమారావుచౌదరి, గుంట కేశవరావు, భీమారావు, దుంపల వైకుంఠరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.