ఓబులవారిపల్లె: గ్రామీణ రైతుబిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణకుమారి దంపతుల ఏకైక కుమార్తె ముక్కా గోమతిరెడ్డి మార్చి 5వ తేదీన ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది.
గోమతిరెడ్డి చిన్ననాటి నుంచి పాఠశాలల్లో బెస్ట్ బేబి తదితర పోటీల్లో రాణిస్తూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేందుకు అన్ని విధాల సహకారం అందించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీల్లో గెలుపొందింది. అనంతరం బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అక్కడితో అగిపోకుండా మోడలింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది.
ఈ ఏడాది జనవరి, 25వ తేదీన ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మిస్ ఇండియా పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్న గోమతిరెడ్డి... మిస్ వరల్డ్ సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా సాధించవచ్చనే లక్ష్యంతో ముందుకువెళుతున్నానని, తన గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment