‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ విజేత సిని శెట్టి (మధ్యలో); మొదటి రన్నర్ అప్ రుబుల్ షెకావత్, సెకండ్ రన్నర్ అప్ షినాటా చౌహాన్
ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే
ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. 21 ఏళ్ల సిని శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ‘మిస్ ఇండియా 2022’ కిరీటాన్ని గెలుచుకుంది. చూడబోతే తుళు స్త్రీల శిరస్సులు అందాల కిరీటాల కోసమూ వారి అధరాలు విజయ దరహాసాల కోసమూ పుడుతున్నట్టున్నాయి.
ఆదివారం ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. రాజస్థాన్‌కు చెందిన రుబుల్ షెకావత్ మొదటి రన్నర్ అప్‌గా నిలువగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచింది.
భారీ హైబ్రిడ్ ఈవెంట్
నేరుగా జరిగే ఈవెంట్‌లో ఆన్‌లైన్ ద్వారా కూడా కొందరు ప్రాతినిధ్యం వహిస్తే అలాంటి ఈవెంట్‌ని ‘హైబ్రిడ్ ఈవెంట్’ అంటారు. అంటే డైరెక్ట్‌గా వర్చువల్‌గా కూడా జరిగే ఈవెంట్ అన్నమాట. ‘మిస్ ఫెమినా ఇండియా 2022’ ఈవెంట్ కూడా ఈ విధంగానే జరిగింది. జూరీలో నేహా దూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్‌తో పాటు మన మిథాలీ రాజ్ కూడా ఉంది. వీరి పరీక్షలన్నింటిని దాటి సిని విజేతగా నిలిచింది. దీని వల్ల ఆమె ఈ సంవత్సరం జరగనున్న 71వ ‘విస్ వరల్డ్’ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
సిని శెట్టి ఎవరు?
కర్నాటకలో మూలాలున్న తుళు కుటుంబం నుంచి వచ్చిన సిని శెట్టి 2000 సంవత్సరంలో ముంబైలోనే పుట్టి అక్కడే పెరిగింది. తల్లి పేరు హైమా శెట్టి. సోదరుడు షికిన్ శెట్టి. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే సిని ముందు నుంచి మోడలింగ్ అంటే ఇష్టపడింది. ప్రియాంకా చోప్రా నుంచి స్ఫూర్తి పొంది ఆమెలాగే ఎదగాలనుకుంది. మంచి భరతనాట్యం డాన్సర్. మోడల్. ఇన్‌స్టాలో ఆమె అకౌంట్ దాదాపు 60 వేల మంది ఫాలోయెర్లు ఉన్నారు నిన్న మొన్నటి దాకా (ఇప్పుడు లక్షల్లో మారుతుంది). ఇన్‌స్టాలో సిని చేసే డాన్స్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి.
‘మాది స్త్రీల విషయంలో సమకాలీన ధోరణి ఉన్న కుటుంబమే అయినా మా సమూహం స్త్రీల విషయంలో సంప్రదాయ విలువల గురించి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఆ విలువలు స్త్రీల విషయంలోనే పట్టింపుతో ఉండటం నేను గమనించాను. స్త్రీ జీవితం అంటే ఏమిటో నాదైన ఒక విలువను వెతుక్కునే ప్రయత్నం చేశాను. నేను ఉండే (మోడలింగ్) రంగంలో స్త్రీలు సంప్రదాయ–ఆధునిక పోకడల మధ్య నలుగుతూ నిలవడం పెద్ద సవాలు. కాని సవాళ్లను ఎదుర్కొనే తత్త్వం వల్లే నేను ఈనాడు ఇక్కడ నిలుచుని ఉన్నాను’ అని సిని అంది.
మరిచిపోలేని జ్ఞాపకం
‘మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?’ అని అడిగితే సిని శెట్టి తన భరతనాట్యం అరంగేట్రం గురించి చెప్పింది.
‘నాకు డాన్సంటే చాలా ఇష్టం. అది శరీరాన్ని, ఆత్మను సంలీనం చేస్తుంది. అది ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందువల్ల నేను ఆరంగేట్రం చేసిన రోజును మర్చిపోలేను. అది నా సంస్కృతితో నేను అనుబంధం ఏర్పరుచుకున్న రోజుగా భావిస్తాను. నా భుజాల నుంచి చెమట కారిపోతున్నా, నా కొప్పుముడిలోని పూసలు ఊడి వేళ్లాడుతున్నా డాన్స్ చేస్తున్నందుకు నా లోలోపల ఉబికిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. మూడు గంటలు ప్రేక్షకుల ముందు డాన్స్ చేసి చివరన భూదేవికి పెట్టిన నమస్కారంతో ధన్యురాలిని అయ్యాను’ అని చెప్పింది సిని.
త్వరలో ఆమె ఏదైనా భారీ సినిమాలో హీరోయిన్‌గా కనిపిస్తే ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment