వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడండి
గ్రీవెన్స్‌సెల్‌లో రూరల్ ఎస్పీకి బాధితుల వేడుకోలు
గుంటూరు క్రైం : జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. మొత్తం 50కు పైగా అందిన ఫిర్యాదులను ఎస్పీ కె.నారాయణ నాయక్, అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు పరిశీలించారు. ఫిర్యాదుల వివరాలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే...
దస్తావేజులు ఇప్పించండి
మా గ్రామంలోని కోటా వెంకటసాంబశివరావు వద్ద ఇంటి దస్తావేజులు హామీగా ఉంచి కొద్ది నెలల క్రితం రూ.20వేలు అప్పుగా తీసుకున్నాను. అతనికి ఇవ్వాల్సిన డబ్బును రూ. 30వేలకు పైగా చెల్లించాను. ఇచ్చిన డబ్బంతా వడ్డీకే సరిపోయిందని, అసలు డబ్బు ఇస్తే దస్తావేజులు తిరిగి ఇస్తానన్నాడు. లేకుంటే ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని నుంచి రక్షణ కల్పించి ఇంటి దస్తావేజులు ఇప్పించాలి.
-షేక్ఘన్సైదా, మసీదు వీధి,
ఫిరంగిపురం న్యాయం చేయాలి
నాభర్త, అత్త వేధింపుల కారణంగా బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్లో గతనెలలో ఫిర్యాదు చేశాను. పోలీసులు నేను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయకుండా నా సోదరి మాధవిని పిలిపించి ఆమెతో ఫిర్యాదు తీసుకుని గతనెల 31న కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలిస్తే ఫిర్యాదులో మార్పు ఉంది. నేను చేసిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి న్యాయం జరిగేలా చూడాలి.
-ఆర్.సురేఖ,
ఏరియా హాస్పటల్ స్టాఫ్‌నర్సు, బాపట్ల చోరీ కేసు రికవరీ చేయాలి
ఆర్మీలో 17 ఏళ్ల పాటు సేవలు అందించి ఎనిమిదేళ్ల క్రితం రిటైర్ అయ్యాను. వస్తున్న పెన్షన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నా. గత ఏడాది నవంబరు 19న ఇంట్లో చోరీ జరిగింది. పదిసార్లు బంగారు ఆభరణాలు, రూ.10వేలు నగదు చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ఆచూకీ ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. వీలైనంత త్వరగా దొంగలను గుర్తించి చోరీకి గురైన సొత్తును తిరిగి అప్పజెప్పాలి.
-పి.వెంకటేశ్వరరావు, కనగాల, చెరుకుపల్లి మండలం